Abn logo
Oct 20 2021 @ 00:31AM

ఇద్దరు నకిలీ బాబాల అరెస్టు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 19: అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగదు కాజేసిన ఇద్దరు నకిలీ బాబాల వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేసి అరెస్టు చేశారు. మంగళవారం పోలీసు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.  మావల మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఫారుఖ్‌ నకిలీ బాబాల మోసంతో రూ.29లక్షలు నష్టపోయామని తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు  చేసి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించామని తెలిపారు. దీంతో సీఐ చంద్రమౌళి నిఘా పెంచడంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రం గాంధీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌ గ్రామానికి చెందిన ఏ1 గోటు ముక్లెసుగ్రీవ్‌, ఆదిలాబాద్‌ పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఏ2 బాల్‌శంకర్‌ సంగీత ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు కలిసి కూరగాయల వ్యాపారం చేస్తుండే వారన్నారు. అయితే నగదును రెట్టింపు చేస్తామనే భావనతో అమాయకులను మోసం చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఈ క్రమంలో 2021 జూన్‌ 15న ఆదిలాబాద్‌ పట్టణం న్యూహౌజింగ్‌ బోర్డు కాలనీలోని మహ్మద్‌ ఫారుఖ్‌ ఇంట్లో వెళ్లి మంత్ర తంత్రాలతో హోమం చేసి నగదును రెట్టింపును చేస్తామని నమ్మించి మొదటి సారిగా రూ.50వేలను హోమంలో ఉంచి రూ.80వేలుగా మార్చి నమ్మించారన్నారు. తద్వారా ఫారుఖ్‌ సోదరికి చెందిన లక్ష రూపాయలను లక్షన్నరగా మార్చి మరింత నమ్మించడంతో ఫిర్యాదుదారులు ఏకంగా రూ.29లక్షలు రెట్టింపు చేయాలని నిందితులకు నగదును అందజేశారని వివరించారు. ఇదే అదునుగా భావించి నిందితులు హోమం చేసినట్లు నటించి రెండు రోజుల తర్వాత నగదు తీసుకుని పరారయ్యారని తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితుల నుంచి రూ.11లక్షల 70వేల నగదు, రూ.20వేల విలువైన రెండు సెల్‌ఫోన్లు, రూ.60వేల విలువైన ల్యాప్‌టాప్‌, రూ.20వేల విలువైన రెండు బంగారుపూత పూసిన గాజులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితులను విచారించగా స్థానిక ముత్నూట్‌ ఫైనాన్స్‌లో 3 తులాల బంగారు గాజులు కుదవ పెట్టినట్లు తెలిపారన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడుతామని మరింత లోతుగా కేసును దర్యాప్తు చేసేందుకు నిందితులను పోలీసు కస్టడీకి కోరుతామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ చంద్రమౌళి, మావల ఏఎస్సై గండ్రత్‌ గంగాధర్‌ తదితరులున్నారు.