వెంటాడిన మృత్యువు.. ఒకచోట ప్రమాదం నుంచి బయటపడిన గంటల వ్యవధిలోనే..

ABN , First Publish Date - 2020-02-19T18:01:53+05:30 IST

దుబాయి, రాస్ అల్ ఖైమాలో పనిచేసే ఇద్దరు భారత ప్రవాసులను మృత్యువు వెంటాడింది.

వెంటాడిన మృత్యువు.. ఒకచోట ప్రమాదం నుంచి బయటపడిన గంటల వ్యవధిలోనే..

దుబాయి, రాస్ అల్ ఖైమాలో పనిచేసే ఇద్దరు భారత ప్రవాసులను మృత్యువు వెంటాడింది. ఇటీవలె స్వదేశానికి వచ్చిన వారిద్దరూ ఒకచోట ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన గంటల వ్యవధిలోనే మరోక చోట సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లంకు చెందిన జిజు థామస్(32), సింజు కే నినాన్(37) అనే ఇద్దరు కజిన్ బ్రదర్స్ సోమవారం ఉదయం తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. జిజు తన కూతురు పుట్టిన రోజు కోసం పది రోజుల కింద స్వస్థలానికి వచ్చాడు. మంగళవారం తిరిగి దుబాయి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. 


జిజు, సింజు తమ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని వేలంకన్నీకి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి పోవడంతో వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రాత్రివేళ కావడంతో వాహనాన్ని బాగు చేసేందుకు సమయం పడుతుందని భావించిన జిజు, సింజు తమ కుటుంబ సభ్యులను ట్యాక్సీలో ఇంటికి పంపించేశారు. కొంత సమయం తర్వాత వాహనాన్ని బాగు చేసుకొని బయల్దేరిన జిజు, సింజులు సోమవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో మరోసారి ప్రమాదం బారిన పడ్డారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌తో పాటు వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 


జిజు జుమైరహాలో ఆరేళ్లుగా చెఫ్‌గా పని చేస్తున్నట్లు అతని బంధువులు తెలిపారు. ఫిబ్రవరి 9న కూతురు ఫస్ట్ బర్త్‌డే ఉండడంతో ఇటీవలె స్వదేశానికి వచ్చాడు. మంగళవారం తిరిగి దుబాయి వెళ్లాల్సి ఉండగా ఈ ఘెరం జరిగిపోయింది. ఇక సింజు ఐదేళ్లు యూఏఈలో పని చేశాడు. ప్రస్తుతం రాస్ అల్ ఖైమాలో పని చేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో చూసుకోవడానికి ఇండియా వచ్చాడని బంధువులు తెలిపారు. గంటల వ్యవధిలోనే సోదరులను మృత్యువు వెంటాడి మరీ చంపేసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.          

Updated Date - 2020-02-19T18:01:53+05:30 IST