రెండు జిల్లాలు.. ఒక్క పంచాయతీ

ABN , First Publish Date - 2022-05-01T06:01:42+05:30 IST

రెండు జిల్లాలు.. ఒక్క పంచాయతీ

రెండు జిల్లాలు.. ఒక్క పంచాయతీ

విభజనకు పంచాయతీరాజ్‌ శాఖ దూరమా?

రెండు జిల్లాలకు ఒక్కరే డీపీవో

కొత్త డివిజన్లకు డీఎల్‌పీవోలు లేరు 

ఎంపీడీవోలకు పదోన్నతులూ లేవు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాల విభజన ఎప్పుడో పూర్తయింది. రెండు జిల్లాల్లోనూ అన్ని శాఖలకూ అధికారుల, కార్యాలయాల సర్దుబాటూ జరిగిపోయింది. అదేమి విచిత్రమో.. పంచాయతీరాజ్‌ శాఖ మాత్రం అన్నింటికీ అతీతంగా విభజనకు దూరంగా ఉండిపోయింది. రెండు జిల్లాలకూ ఇప్పటికీ పాత డీపీవోనే కొనసాగుతున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడినా డీఎల్‌పీవోల నియామకం జరగలేదు. ఎండీవోలకు పదోన్నతులూ లేవు. జనాభా ప్రాతిపదికన పోస్టుల సర్దుబాటూ లేదు. దీంతో రెండు జిల్లాల్లో గందరగోళం కొనసాగుతోంది. 

పదోన్నతుల మాటేంటి?

రాష్ట్రవ్యాప్తంగా 236 మంది ఎంపీడీవోలు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాల పునర్విభజనతోనైనా పదోన్నతులు ఉంటాయని భావించిన వారి ఆశలు నెరవేరలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు డీపీవోగా ఉన్న జ్యోతి ప్రస్తుతం రెండు జిల్లాలకూ డీపీవోగా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లకు జవాబుదారీగా ఉండాలి. జిల్లాలు విడిపోయాక రెండుచోట్ల పనిచేయటం ఇబ్బందిగా మారుతోంది. నిర్ణయాలు తీసుకోవడం మొదలు వాటిని అమలుచేయడం వరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

అధికారులేరి?

రెండు జిల్లాల్లోనూ కొత్తగా డివిజన్లు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పాతదే అయినా కొత్తగా తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అలాగే, కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, గుడివాడతో పాటు కొత్తగా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. రెవెన్యూ శాఖ కొత్తగా ఏర్పడిన డివిజన్లలో ఆర్డీవోలను నియమించింది. పంచాయతీ విభాగం మాత్రం డివిజనల్‌ పంచాయతీ అధికారుల (డీఎల్‌పీవో)ను నియమించలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ డీఎల్‌పీవోనే నందిగామ, తిరువూరు డివిజన్ల వ్యవహారాలను కూడా సమీక్షించాల్సి వస్తోంది. కృష్ణాజిల్లాలో గుడివాడ డీఎల్‌పీవోనే ఉయ్యూరు డివిజన్‌ వ్యవహారాలను చూడాల్సి వస్తోంది. రెండు జిల్లాల్లోనూ డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణం కొత్త జిల్లాల ప్రాతిపదికన పంచాయతీరాజ్‌ శాఖను కూడా విభజించి, అధికారులను నియమించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-05-01T06:01:42+05:30 IST