‘సబ్బు’ కోసం ఇంటికెళ్లొచ్చేసరికి ఘోరం జరిగిపోయింది!

ABN , First Publish Date - 2020-05-21T16:12:44+05:30 IST

సోదరుడితో కలిసి చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు.

‘సబ్బు’ కోసం ఇంటికెళ్లొచ్చేసరికి ఘోరం జరిగిపోయింది!

హైదరాబాద్/మదీన : సోదరుడితో కలిసి చెరువుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బండ్లగూడ సాదత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఖాసిం హుసేన్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ నవాజ్‌ బుధవారం ఉదయం 11-30 సమయంలో సమీపంలోని ఓ చెరువులో దుస్తులు ఉతుక్కోవడానికి వెళ్లాడు. అతని చెల్లెలు కుల్సుం ఫాతిమా(6), మహ్మద్‌ కరీం అలియాస్‌ అబ్బా్‌స(4) కూడా సోదరుడి వెంట చెరువుకు వెళ్లారు. దుస్తులు ఉతుక్కోవడానికి ప్రయత్నించేసరికి సబ్బు కనిపించలేదు. దీంతో చెల్లెలిని, తమ్ముడిని సమీపంలోని ఒక బండరాయిపై కూర్చోబెట్టి సబ్బు తెచ్చుకోవడానికి వెళ్లాడు. 


తిరిగి వచ్చేసరికి ఇద్దరూ కనిపించలేదు. ఆందోళనతో పరుగున ఇంటికి వెళ్లి తమ్ముడు, చెల్లి కనిపించడంలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తల్లి, తండ్రి, స్థానికులు చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారమందించారు. స్థానికులు కొంతమంది నీళ్లలోకి దిగి వెతకగా చిన్నారులు నీళ్లలో మునిగి కనిపించారు. వారిని ఒడ్డుకు చేర్చి పరిశీలించగా అప్పటికే చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి  తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ తెలిపారు.

Updated Date - 2020-05-21T16:12:44+05:30 IST