‘అతను నన్ను రోజూ చీట్ చేసేవాడు.. అది విని మా ఆయన..’

ABN , First Publish Date - 2021-08-02T06:19:25+05:30 IST

యలమంచిలి మండలం..

‘అతను నన్ను రోజూ చీట్ చేసేవాడు.. అది విని మా ఆయన..’

అసలేం జరిగింది?

గోదావరిలోకి దూకిన కుటుంబం

తండ్రీకూతుళ్ల మృతదేహాలు లభ్యం

ఆచూకీ దొరకని తల్లీకొడుకులు

ఉభయ గోదావరి జిల్లాల్లో కలకలం

ఘాతుకానికి కారణాలు ఏమిటో!

సంధ్య పేరిట వాట్సప్‌లో మెసేజ్‌ వైరల్‌


యలమంచిలి/పాలకొల్లు రూరల్‌/ఆచంట/మామిడికుదురు: యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు గోదావరిలో దూకి గల్లంతైన ఘటన ఉభయ గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతోంది. అసలు వీరికి ఏం కష్టమొచ్చింది? ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డారు? దీని వెనుక కారకులు ఎవరు? అనే చర్చ బంధువర్గాల్లో నడుస్తోంది. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన నలుగురిలో ఆదివారం తండ్రీ కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. ఇంకా తల్లీ కొడుకుల ఆచూకీ తెలియాల్సి ఉంది. పాలకొల్లు రూరల్‌ సీఐ డి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురుకు చెందిన కంచి సతీష్‌(34)కు భార్య సంధ్య(28), కుమారుడు జస్విన(4), కుమార్తె ఇందుశ్రీదుర్గ(2) ఉన్నారు. కొంత కాలం క్రితం సతీష్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లాడు. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల నెలా కొంత సొమ్మును ఇంటికి పంపించేవాడు.


ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో జూలై 20న స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. కుటుంబంతో కలిసి జూలై 29న అతని సమీప బంధువు, బావమరిది అయిన కేశవదాసుపాలేనికి చెందిన కుడిపూడి పల్లయ్యశెట్టి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు అక్కడ గడిపి అనంతరం తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తరువాత రెండు రోజులు పాలకొల్లు మండలం వెలివెలలో భార్య సంధ్య పెద్దమ్మ ఇంట్లో ఉన్నారు. అక్కడ నుంచి సతీష్‌ తన తల్లి ఉంటున్న గుంటూరు వెళ్లి వస్తామని 30వ తేదీ రాత్రి భార్య, పిల్లలతో కలిసి వెళ్లాడు. అప్పటి నుంచి అతని సమాచారం తెలియలేదు. సెల్‌ ఫోన్ కూడా చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో వారి ఆచూకీ కోసం పల్లయ్యశెట్టి బంధువులను వాకబుచేశాడు.


ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చించినాడ బ్రిడ్జి వద్ద ఒక బైకు, బకెట్‌లో దుస్తులు ఎవరో వదిలి వెళ్లారన్న సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పల్లయ్యశెట్టి శనివారం రాత్రి పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం సతీష్‌, అతని కుమార్తె ఇందుశ్రీదుర్గల మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లీ కొడుకుల కోసం గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేసిన్నట్లు పోలీసులు తెలిపారు. 


విషాదంలో కుటుంబ సభ్యులు

ఆచంట మండలం బాలంవారిపాలెంకు చెందిన కట్టా సూర్యనారాయణ, ధనలక్ష్మిల కుమార్తె సంధ్య. సూర్యనారాయణ గల్ఫ్‌లో ఉంటున్నారు. తల్లి ధనలక్ష్మితోపాటు సోదరుడు గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఘటన తెలుసుకున్న తల్లి ధనలక్ష్మి బోరున విలపించింది. ప్రస్తుతం సంధ్య తల్లి కూడా చించినాడ దగ్గరకు వెళ్లారు. ఎంతో భవిష్యత్తువున్న తన కుమారుడు కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడడంతో సతీష్‌ తండ్రి భగవానదాస్‌, తల్లి లక్ష్మి విలపిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.


ఎవరీ ఫణీంద్ర?

‘మా నలుగురి చావుకు కారణం ఫణీంద్ర, వాళ్ల అక్క, బావ, వాళ్ల అమ్మా నాన్న.. అతను నన్ను రోజూ చీట్‌ చేసేవాడు. నాకు తెలియకుండా టాబ్లెట్‌లు ఇచ్చేవాడు. నా డబ్బులు, బంగారం దొంగతనంగా తీసుకెళ్లిపోయాడు. అది విని మా ఆయన తట్టుకోలేకపోయాడు. మొత్తం నా కాపురాన్ని నాశనం చేశారు. నా డబ్బు, బంగారంపై ఆశపడే ఇదంతా చేశారు. మా నలుగురి జీవితాలను నాశనం చేశారు’ అంటూ సంధ్య పేరుతో రాసిన మెసేజ్‌ వాట్సప్‌లో పోస్టు చేశారు. దీంతోపాటు వాయిస్‌ మెసేజ్‌ను ఆమె పోస్టు చేసింది.


Updated Date - 2021-08-02T06:19:25+05:30 IST