రెండు రోజుల పెళ్లి

కట్రీనా కైఫ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శుభ ఘడియలు రానే వచ్చాయి. చాలా కాలంగా  ప్రేమలో ఉన్న కట్రీనా, విక్కీ కౌశల్‌ ఇప్పుడు  పెళ్లి పీటల వరకూ వచ్చారు. గురువారం వివాహబంధంతో వీరిద్దరూ ఒకటికానున్నారు. అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో రెండు రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకకు రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌  కోట వేదికగా మారింది. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను చివరి క్షణం వరకూ రహస్యంగానే ఉంచింది ఈ ప్రేమజంట. అంతే కాదు పెళ్లికి సంబంధించిన కవరేజ్‌ అంతా ఎక్స్‌క్లూజివ్‌గా ఒకరికే అప్పగించడం వల్ల ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు కట్రీనా, విక్కీ. ఆ మేరకు అతిధులకు ముందే విషయాన్ని వెల్లడించి, విజ్ఞప్తి చేశారు కూడా. 


పెళ్లికి వచ్చేవారు రూమ్‌లోనే సెల్‌ఫోన్లు వదిలిపెట్టి రావాలి,  ఫొటోలు తీయకూడదు, పెళ్లి జరిగే లొకేషన్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదు, పెళ్లికి వచ్చిన వారు అక్కడ నుంచి బయటకు వచ్చేవరకూ బయటి వ్యక్తులతో మాట్లాడకూడదు.. ఇలా ఇంతకు ముందు ఎన్నడూ ఎరగని    కట్టుదిట్టమైన అనేక నిబంధనల మధ్య వీరి పెళ్లి జరుగనుంది. మంగళవారం రాత్రి సంగీత్‌ జరిగింది. బుధవారం మెహందీ కార్యక్రమం ఉంటుంది. గురువారం పెళ్లి జరుగుతుంది. ఏడు గుర్రాలు కలిగిన రథంలో విక్కీ వివాహ వేదిక దగ్గరకు వస్తారని సమాచారం . పెళ్లయిన తర్వాత విక్కీ, కట్రీనా హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళతారని చెబుతున్నారు.


Advertisement