మూత్రపిండాలను నిర్లక్ష్యం చేయొద్దు!

ABN , First Publish Date - 2022-03-10T04:37:29+05:30 IST

మూత్రపిండాల(కిడ్నీ)ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. కొవిడ్‌తో గత ఏడాదిన్నరగా మూత్రపిండాల బాధితులు ఎక్కువయ్యారు.

మూత్రపిండాలను నిర్లక్ష్యం చేయొద్దు!
కిడ్నీ డే లోగో

అనేక అలవాట్లతో అనర్థాలు

చిన్నారుల్లోనూ వ్యాధిగ్రస్థులు 

జిల్లాలో 70 వేల మందికి పైగా రోగులు

233కి పైగా కిడ్నీల మార్పిడి  

నేడు ప్రపంచ కిడ్నీ వ్యాధుల నివారణ దినోత్సవం 

నెల్లూరు(వైద్యం), మార్చి 9 : మూత్రపిండాల(కిడ్నీ)ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. కొవిడ్‌తో గత ఏడాదిన్నరగా మూత్రపిండాల బాధితులు ఎక్కువయ్యారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మూత్ర పిండాలు దెబ్బతిన్న వారే ఉన్నారు. మూత్రపిండాలపై ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం, నిర్లక్ష్యం చేయడం, చెడు అలవాట్ల కారణంగా ప్రాణాపాయానికి గురవుతున్నారు. జిల్లాలో మూత్రపిండాలు వ్యాధిగ్రస్థుల సంఖ్య నానాటికి పెరుగుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రస్తుతం 70 వేల మందికి పైగా వ్యాధిగ్రస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. జీవనశైలిలో మార్పు లేకపోవడంతో ప్రతి వంద మందిలో 10 మంది కిడ్నీ సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. పది శాతం మంది చిన్నారులూ కిడ్నీ వ్యాధులకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కిడ్నీ ఫౌండేషన్‌ మార్చి 10వ తేదీన ప్రపంచ కిడ్నీ వ్యాధుల నివారణ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది.

రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలు 

కిడ్నీ వ్యాధులకు మధుమేహం, రక్తపోటు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే శరీరంలోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీసి రక్తం వడపోత సామర్ధ్యం తగ్గి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. మూత్రంలో ప్రొటీన్లు సంఖ్య విపరీతంగా తగ్గిపోయి క్రమేపి కిడ్నీల వైఫల్యం జరుగుతోంది. అలాగే రక్తపోటు 130/80 కంటే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధికి గురి కావాల్సి వస్తోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మధుమేహం, 30 శాతం మంది రక్తపోటు వ్యాధిగ్రస్థులే. వంశపారంపర్యంగా కొందరు ఈ వ్యాధికి గురవుతున్నారు. ఊబకాయం కూడా ఈ వ్యాధికి మరో కారణం. వీటి వల్ల వ చ్చే కిడ్నీ వ్యాధులు ముదిరి గుండెపోటుకు దారి తీస్తోంది. 

జిల్లాలో 70 వేల మంది...

జిల్లాలో ఇప్పటికే 70 వేల మందికిపైగా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పొదలకూరు మండలం ఊసరపల్లి గ్రామంలోనే 75 శాతం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారంటే జిల్లాలో ఈ వ్యాధి తీవ్రత అర్ధమవుతోంది. తూర్పుయడవల్లి, సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, ఎఎ్‌సపేట, తదితర మండలాల్లో కూడా ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నీటిలో ఫ్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. ప్రతినెల 6 వేలకు మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. 

233 పైగా కిడ్నీల మార్పిడి 

కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన వారికి తాత్కాలిక రక్తశుద్ధి(డయాలసి్‌స)తో పాటు కిడ్నీ మార్పిడిలు కూడా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఇప్పటికే 233కు పైగా కిడ్నీ మార్పిడిలు విజయవంతంగా నిర్వహించారు. అలాగే గుండె జబ్బులతో మరణించే వారిలో ఎక్కువగా కిడ్నీ దెబ్బతిన్న కేసులేనన్న విషయాలను వైద్యులు వెల్లడిస్తున్నారు. పూర్తిగా కిడ్నీ వ్యాధిని నివారించినా 10, 12 ఏళ్ల తరువాత మళ్లీ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తప్పనిసరిగా ఆరు నెలలకొకసారి కిడ్నీ చికిత్సలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


కొవిడ్‌తో కిడ్నీలు దెబ్బతిని ఎంతో మంది మరణించారు 

కొవిడ్‌తో కిడ్నీలు దెబ్బతిని చాలా మంది మరణించారు. కిడ్నీ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. నారాయణ ఆసుపత్రిలో ఇప్పటికే వందకు పైగా కిడ్నీమార్పిడిలు విజయవంతంగా నిర్వహించాం.

-  డాక్టర్‌ కొల్లా ప్రవీణ్‌కుమార్‌, (కిడ్నీ వ్యాధి నిపుణులు, నారాయణ ఆసుపత్రి)



వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి 

కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మొదటి దశలోనే వ్యాధిని గుర్తిస్తే నయం చేయవచ్చు. ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా కూడా వ్యాధి వస్తుంది. ఏడాదికి రెండు సార్లు సాధారణ, బీపీ, షుగర్‌ ఉన్న మూడు నెలలకొకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.  

- డాక్టర్‌ చక్రవర్తి, (అపోలో ఆసుపత్రి కిడ్నీ వైద్య నిపుణులు)






Updated Date - 2022-03-10T04:37:29+05:30 IST