విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి Covid

ABN , First Publish Date - 2021-12-04T14:02:05+05:30 IST

కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. వారితోపాటు

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి Covid

                - చెన్నై, తిరుచ్చి ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌


చెన్నై: కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. వారితోపాటు వచ్చిన ప్రయాణికులకు కూడా కరోనా ముందస్తు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు న్నాయని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖ హెచ్చరించడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను ముమ్మరం చేశారు. విమాన ప్రయాణీకులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం మదురై విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌, ఒమైక్రాన్‌ వైరస్‌ ముందస్తు వైద్యపరీక్షలను ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బుధవారం సింగపూరు నుంచి తిరుచ్చి వచ్చిన విమానాల్లో దిగిన ప్రయాణికులకు, ఇదే విధంగా సింగపూరు నుంచి శ్రీలంక మీదుగా వచ్చిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం నుంచి దిగిన ప్రయాణికులు మొత్తం 663 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వారికి పాజిటివ్‌ లక్షణాలు లేవని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.45 గంటలకు సింగపూరు నుంచి స్కూట్‌ విమానం తిరుచ్చి వచ్చింది. ఆ విమానంలో ప్రయాణించిన133 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో సింగపూరుకు చెందిన 56 యేళ్ళ వ్యక్తికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను కరోనా ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి డీన్‌ వనిత మాట్లాడుతూ సింగపూరు నుంచి వచ్చిన ప్రయాణికుడికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని, అయితే ఆయనకు ‘ఒమైక్రాన్‌’ సోకిందో లేదో నిర్ధారించాల్సి వుందని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రయాణికుడి రక్తపు నమూనాను చెన్నైలోని ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. 


చెన్నైలో... : 

ఇదే విధంగా లండన్‌ నుంచి గురువారం రాత్రి విమానంలో చెన్నై చేరుకున్న ప్రయాణికుల్లో పదేళ్ళ చిన్నారికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం గిండీలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారికి అత్యంత సమీపంలో ప్రయాణించిన వారికి కరోనా ముందస్తు పరీక్షలు నిర్వహించారు. ఎయిర్‌హోస్టెస్‌లను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. ఇకపై చెన్నై విమానాశ్రయంలో దిగే ప్రయాణికులకు పాజిటివ్‌ లక్షణాలుంటే రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలిస్తారని డీన్‌ ఆంటోని రాజన్‌ తెలిపారు.


రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా తీవ్రతరం

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రెండు ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడటంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఆరోగ్య, రెవెన్యూ శాఖ అధికారులు నిఘా తీవ్రతరం చేస్తున్నారు. కర్ణాటకు నుంచి వచ్చే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారికి ప్రత్యేక శిబిరాల్లో టీకాలు కూడా వేస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న కాయగూరల లారీలు, కార్లు, వ్యాన్‌లు, టూరిస్టు వాహనాల్లో వచ్చేవారికి థర్మల్‌స్కాన్‌ పరీక్షలు జరుపుతున్నారు. మాస్కు లేనివారికి జరిమానా విధిస్తున్నారు. ఆరోగ్య, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పోలీసులు కూడా నిఘా వేస్తున్నారు. నీలగిరి జిల్లా గూడలూరు, హోసూరు వద్ద ఈ నిఘా తీవ్రస్థాయిలో చేపడుతున్నారు. హోసూరు వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. కరోనా వైద్యపరీక్షలలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడితే వారిని ఆస్పత్రిలో తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా ఉంచారు. రెండు డోస్‌లు కరోనా నిరోధక టీకాలు వేసుకున్నవారికి కూడా ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు వైద్యపరీక్షలు జరుపుతున్నారు.

Updated Date - 2021-12-04T14:02:05+05:30 IST