వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కిషన్‌బాగ్ నజమ్‌నగర్‌లో బాలకృష్ణ, హఫీజ్‌బాబానగర్‌లో జబియా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
హైదరాబాద్/మదీన: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నఘటన బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కిషన్‌బాగ్ నజమ్‌నగర్ ప్రాంతానికి చెందిన దశరథ కుమారుడు బాలకృష్ణ(28) మద్యానికి బానిస. అతని తల్లి ఒవైసీ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతుంటుంది. రోజూ ఖర్చుల కోసం తల్లి దగ్గర డబ్బులు తీసుకునేవాడు. రాత్రి తాగొచ్చి తల్లితో గొడవపడేవాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. బహదూర్‌పురా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
అత్తింటి వేధింపులకు మహిళ...
చంపాపేట: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన జబియా(21) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు బాబు(1) ఉన్నాడు. అత్త షహజా(60), భర్త ముక్తార్(26)వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి మహ్మద్‌ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.