పెరుగన్నం ప్రాణాలు తీసిందా?

ABN , First Publish Date - 2021-12-19T07:40:04+05:30 IST

ఆ ఇంట్లో రాత్రి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు భోజనం చేశారు. తల్లి, ఇద్దరు పిల్లలు పెరుగన్నం తిన్నారు.

పెరుగన్నం ప్రాణాలు తీసిందా?

  • రాత్రి నిద్రపోయిన చోటే ఇద్దరు పిల్లల మృతి
  • ఆస్పత్రిలో తల్లి.. పరిస్థితి విషమం.. తినని భర్త, మరో బిడ్డ సేఫ్‌ 
  • మత్తుమందు కలిపారా?.. వికారాబాద్‌ జిల్లాలో ఘటన 


మోమిన్‌పేట, డిసెంబరు 18: ఆ ఇంట్లో రాత్రి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు భోజనం చేశారు. తల్లి, ఇద్దరు పిల్లలు పెరుగన్నం తిన్నారు. తెల్లారేసరికి ఇద్దరు పిల్లలు నిద్రించిన చోటే మృతిచెందారు. తల్లి తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మక్తతండాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఉద్దండాపూర్‌కు చెందిన మంజుల, సుభాష్‌ భార్యాభర్తలు. వీరికి మీనాక్షి(6), మైత్రి(3), యశస్విని(15నెలలు) కూతుళ్లు.  వారం క్రితం మోమిన్‌పేట మండలం మక్తతండా గ్రామానికి చెందిన జర్పుల బాబు కోళ్ల ఫారంలో భార్యాభర్తలు పనికి కుదిరారు.  శుక్రవారం రాత్రి సుభాష్‌ కుటుంబసభ్యులు అందరూ కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.


ఉదయం సుభాష్‌ లేచి చూసేసరికి ఇద్దరు కూతుళ్లు మైత్రి, యశస్విని విగతజీవులుగా కనిపించారు.  మంజులను పోలీసుల సాయంతో వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి మంజుల, మైత్రి, యశస్విని పెరుగన్నంతో భోజనం చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరుగన్నం తినని సుభాష్‌, మైత్రి క్షేమంగా ఉండటంతో ఎవరైనా మత్తుమందు కలిపి ఉంటారా? అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన పెరుగన్నాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. సుభాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-12-19T07:40:04+05:30 IST