అతివేగం తెచ్చిన అనర్థం

ABN , First Publish Date - 2022-07-03T06:33:27+05:30 IST

అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలయ్యారు. పోలీసుల కథనం మేరకు..తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాళ్యానికి చెందిన సుబ్బయ్య కుమారుడు టి.మస్తాన్‌(21) చిత్తూరు సమీపం ముత్తిరేవుల సమీపంలోని ఎస్వీ సెట్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

అతివేగం తెచ్చిన అనర్థం
డివైడర్‌ను ఢీకొని అవతలవైపు ఉన్న ప్లాట్‌ఫామ్‌ కింద పడి మృతి చెందిన చైతన్య

బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న వైనం

ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి


చిత్తూరు, జూలై 2: అతి వేగానికి ఇద్దరు విద్యార్థులు బలయ్యారు. పోలీసుల కథనం మేరకు..తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాళ్యానికి చెందిన సుబ్బయ్య కుమారుడు టి.మస్తాన్‌(21) చిత్తూరు సమీపం ముత్తిరేవుల సమీపంలోని ఎస్వీ సెట్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లెకు చెందిన దోస్తి నాగిరెడ్డి కుమార్తె  చైతన్య(20) బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మస్తాన్‌ చిత్తూరులో గదిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచి కళాశాలకు వెళుతున్నాడు. చైతన్య చిత్తూరులోని ఓ పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. ప్రస్తుతం వీరికి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం కాలేజీలో పరీక్షలకు హాజరై తిరిగి చిత్తూరుకు వస్తుండగా దొడ్డిపల్లె ఫ్లై ఓవర్‌ పై ఓ మలుపు వద్ద అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్‌ డివైడర్‌ గోడకు ఢీకొని అక్కడే పడిపోయాడు. వెనుకవైపు కూర్చున్న చైతన్య డివైడర్‌కు అవతలవైపు ఉన్న స్లాబ్‌పై పడింది. ఇద్దరి తలలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



Updated Date - 2022-07-03T06:33:27+05:30 IST