ఇద్దరు బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా

ABN , First Publish Date - 2021-05-13T18:57:41+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా..

ఇద్దరు బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ బిమన్ బెనర్జీకి వీరు అందజేశారు. ఈ ఇద్దరూ బీజేపీ ఎంపీలుగా ఉంటూనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తాజాగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో వీరు ఎంపీలుగా కొనసాగుతారు. రణఘాట్‌ నియోజవర్గానికి సర్కార్ ఎంపీగా ఉండగా, కూచ్‌బెహర్ నియోజకవర్గానికి ప్రమాణిక్ ఎంపీగా ఉన్నారు. కాగా, బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు సర్కార్, ప్రమాణిక్ తెలిపారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలని అధిష్ఠానం ఆదేశించిందని చెప్పారు. అధిష్ఠానం నుంచి సమాధానం రాకపోవడంతో ఈ ఇద్దరూ గత వారం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఈ ఇద్దరూ రాజీనామా చేయడంతో ఆరు నెలల్లోగా వారు గెలిచిన దిన్‌హటా, శాంతిపూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల జరగాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి రాజానామాలతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 75కు తగ్గింది.

Updated Date - 2021-05-13T18:57:41+05:30 IST