రెండు బైక్‌లు ఢీ.. దీన్నే సాకుగా చూపి ఎంత పనిచేశారంటే...!

ABN , First Publish Date - 2021-07-06T17:30:08+05:30 IST

ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మరో ...

రెండు బైక్‌లు ఢీ.. దీన్నే సాకుగా చూపి ఎంత పనిచేశారంటే...!
FILE PHOTO

  • యాక్సిడెంట్‌ను సాకుగా చూపి దోపిడీకి పాల్పడ్డ యువకులు
  • బెదిరించి నగదు, రూ.లక్ష చెక్కు, వాహనంతో పరారీ

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మరో వాహనదారుడిని బెదిరించి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం... ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన నరేందర్‌(30) వృత్తి రీత్యా బోయిన్‌పల్లిలోని ఓ కేంటీన్‌లో పని చేస్తున్నాడు. సోమవారం విధులకు వెళ్తుండగా ఆబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి జగదీష్‌ మార్కెట్‌ వద్ద తన వాహనం పక్కనే మరో వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఒక్కసారిగా వేగం పెంచి నరేందర్‌ వాహనం ముందుకు రావడంతో రెండూ ఢీకొన్నాయి.


యాక్సిడెంట్‌ చేయడం వల్ల తమ వాహనం పాడైందని, మరమ్మతులు చేయించాలని నరేందర్‌ను ఆ యువకులు దబాయించారు. మెకానిక్‌ వద్దకు వెళ్లేందుకు బయలు దేరగా గన్‌ఫౌండ్రీ వద్దకు చేరుకోగానే ఇద్దరు యువకులు నరేందర్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.15 వేల నగదు, సెల్‌ఫోన్‌, గడియారం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను లాక్కున్నారు. అనంతరం నరేందర్‌ను బొగ్గులకుంట సమీపంలోకి తీసుకువెళ్లి మరికొంత మంది యువకులతో కలిసి అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను సోదా చేశారు. బ్యాగులోని రూ. లక్ష చెక్కును లాక్కుని, మరో రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు. తాను కేంటీన్‌లో పనిచేసే వాడిననీ, తన వద్ద డబ్బు లేదనీ వేడుకునే ప్రయత్నం చేయగా మరో మారు దాడి చేసి యాక్టివా వాహనాన్ని లాక్కుని పరారయ్యారు. దీంతో నరేందర్‌ ఆబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-06T17:30:08+05:30 IST