రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అపహరించి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-15T06:49:17+05:30 IST

రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపహరించి బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 10 మంది సభ్యులను అరెస్ట్‌ చేసి రెండు రోజుల గడవకుండానే ఏలూరు నగరంలో మరో ఇద్దరు పోలీసులకు చిక్కారు.

రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అపహరించి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ఏలూరు క్రైం, మే 14 : రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపహరించి  బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 10 మంది సభ్యులను అరెస్ట్‌ చేసి రెండు రోజుల గడవకుండానే ఏలూరు నగరంలో మరో ఇద్దరు పోలీసులకు చిక్కారు. వీరు ఆశ్రం ఆసుపత్రి నుంచి అపహరించినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. ఏలూరు నగరంలో  శుక్రవారం ఉదయం వీరు టూటౌన్‌ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. తంగెళ్ల మూడి ప్రాంతానికి చెందిన ఒక నర్సు ఆశ్రం ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె భర్త ఒక అంబులెన్సు డ్రైవర్‌ కాగా వీరిద్దరు ఆశ్రం ఆసుపత్రి నుంచి రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు తెచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టి శుక్రవారం ఉదయం డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. వారిద్దరు వచ్చి ఇంజక్షన్లు ఇచ్చి సొమ్ము తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు వారిని పట్టుకున్నారు. తమదైన శైలిలో ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆశ్రం ఆసుపత్రిలో కూడా భారీగానే రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కుంభకోణం ఉన్నట్లు ఇప్పటికే చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా అధికారులు ఖాళీ వైల్స్‌ను లెక్కపెడితే కానీ అసలు లెక్క బయట పడదు. 


Updated Date - 2021-05-15T06:49:17+05:30 IST