కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-02-16T22:12:57+05:30 IST

త్తరప్రదేశ్‌లోని కర్హల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి..

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇద్దరి అరెస్టు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కర్హల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యాపాల్ సింగ్ బఘెల్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కర్హల్ పోలీస్ స్టేషన్‌లో బఘెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బఘెల్ ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ బుధవారంనాడు తెలిపారు.


కర్హల్‌లోని అత్తికుల్లాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం బఘెల్ ప్రచారానికి వెళ్లిన సమయంలో కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు పగిలినప్పటికీ ఆయన గాయపడకుండా బయటపడ్డారు. తనను చంపేందుకే ఈ దాడి జరిగిందని, సమాజ్‌వాదీ అనుకూల నినాదాలు చేస్తూ కొందరు రాళ్లదాడి జరిపారని ఆయన చెప్పారు. కర్హల్‌లో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూసి అఖిలేష్‌ యాదవ్‌కు భయం పట్టుకుందని ఆరోపించారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు తన ప్రాణాలను కాపాడారని చెప్పారు. బూత్‌లు క్యాప్చరింగ్ చేసి ఎన్నికల్లో నెగ్గాలని అఖిలేష్ అనుకుంటున్నట్టు ఆరోపించారు. కాగా, ఈ దాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం బఘెల్‌కు కల్పిస్తున్న 'వైప్లస్' కేటగిరి స్థానే 'జడ్' కేటగిరి భద్రతను కేంద్ర హోం శాఖ కల్పించింది. కర్హల్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అబ్యర్థిగా అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

Updated Date - 2022-02-16T22:12:57+05:30 IST