అర్ధరాత్రి CC Cameraను పక్కకు తిప్పి ఎంత పనిచేశారో చూడండి..!

ABN , First Publish Date - 2021-12-15T14:50:07+05:30 IST

అర్ధరాత్రి CC Cameraను పక్కకు తిప్పి ఎంత పనిచేశారో చూడండి..!

అర్ధరాత్రి CC Cameraను పక్కకు తిప్పి ఎంత పనిచేశారో చూడండి..!

  • రూ.55 లక్షలు చోరీ
  • సీసీ కెమెరా పక్కకు తిప్పి కార్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లోకి ఎంట్రీ
  • మెకానిక్‌ సహా ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : కారు సర్వీసింగ్‌ సెంటర్‌ ప్రారంభానికి యజమాని సమకూర్చుకున్న డబ్బును మరో ఇద్దరితో కలిసి మెకానిక్‌ చోరీ చేశాడు. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అల్లం శ్రీకాంత్‌రెడ్డి శ్రీ మోటార్స్‌ పేరుతో లగ్జరీ కార్ల సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మరో సర్వీసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించేందుకు నగదును సమకూర్చుకుంటున్నాడు. తన కార్యాలయం బీరువాలో రూ.55 లక్షల నగదును భద్రపరిచాడు. నాలుగేళ్లుగా అతడి వద్దే మెకానిక్‌గా పని చేస్తున్న మహ్మద్‌ తాహేర్‌ (20) ఆ విషయాన్ని గమనించాడు. 


ఆ డబ్బును చోరీ చేసేందుకు మిత్రులు సయ్యద్‌ జావెద్‌ (19), సైఫ్‌ మొహినుద్దీన్‌(19)తో కలిసి పథకం వేశాడు. దీనిలో భాగంగా వర్క్‌షా్‌పలోని యజమాని కార్యాలయంలోకి వెళ్లే వ్యక్తులు కనిపించకుండా సీసీ కెమెరాను పక్కకు తిప్పాడు. అనంతరం ఈ నెల 9న అర్ధరాత్రి ముగ్గురూ కలిసి కార్‌ షెడ్‌ బోల్టులను తొలగించారు. తాహేర్‌, సైఫ్‌లు బయటే ఉండగా జావెద్‌ లోపలికి వెళ్లి వెంట తెచ్చుకున్న పాన కొన భాగంతో బీరువాను, అందులోని లాకర్‌ను తెరిచి రూ.55లక్షల నగదు సంచితో బయటకు వచ్చేశాడు. ఆ డబ్బులో తాహేర్‌, సైఫ్‌లు రూ.20 లక్షల చొప్పున పంచుకొని జావెద్‌కు రూ.15 లక్షలు ఇచ్చారు. మర్నాడు సర్వీస్‌ సెంటర్‌లో ఉంచిన డబ్బు కనిపించకపోవడంతో శ్రీకాంత్‌రెడ్డి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డు అందజేస్తామని డీసీపీ తెలిపారు.



Updated Date - 2021-12-15T14:50:07+05:30 IST