పశ్చిమ బెంగాల్ గవర్నర్, తమిళనాడు సీఎం మధ్య ట్విటర్ వార్

ABN , First Publish Date - 2022-02-13T21:47:41+05:30 IST

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, తమిళనాడు ముఖ్యమంత్రి

పశ్చిమ బెంగాల్ గవర్నర్, తమిళనాడు సీఎం మధ్య ట్విటర్ వార్

చెన్నై : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య ట్విటర్ వేదికగా వాడివేడి సంభాషణ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసన సభను ప్రొరోగ్ చేయడంపై స్టాలిన్ ఆక్షేపణ తెలిపారు. స్టాలిన్ వాస్తవాలను తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడారని ధన్‌కర్ మండిపడ్డారు. 


పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుతో శాసన సభను గవర్నర్ శనివారం ప్రొరోగ్ చేశారు. స్టాలిన్ ఇచ్చిన ట్వీట్లలో దీనిపై పరుషంగా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆ రాష్ట్ర శాసన సభ సెషన్‌ను ప్రొరోగ్ చేస్తూ తీసుకున్న చర్య ఎటువంటి ఔచిత్యం లేనిదని, ఉన్నత స్థాయి పదవిని నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి ఇటువంటిదానిని ఆశించడం లేదని, నియమాలు, సంప్రదాయాలకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. రాష్ట్ర నామమాత్రపు అధిపతి రాజ్యాంగాన్ని బలపరచడంలో ఆదర్శప్రాయంగా వ్యవహరించాలన్నారు. పరస్పరం గౌరవించుకోవడంలోనే ప్రజాస్వామ్యపు సౌందర్యం ఉంటుందన్నారు. 


దీనిపై గవర్నర్ ధన్‌కర్ సమాధానమిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుగ్రహ దృష్టిని అత్యంత గౌరవప్రదంగా ఆహ్వానించడం అసాధారణంగా అత్యవసరమని గుర్తించానని తెలిపారు. యథార్థాలకు ఎంత మాత్రం అనుగుణంగా లేని పరుషమైన, బాధించే తీవ్ర వ్యాఖ్యలను ఆయన చేసినట్లు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. ఆర్డర్ కాపీని జత చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టంగా కోరిన తర్వాత మాత్రమే శాసన సభను ప్రొరోగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ ట్వీట్‌తో జత చేశారు. 


ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ మాట్లాడుతూ, శాసన సభను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ధన్‌కర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆయన సొంతంగా తీసుకోలేదన్నారు. రాష్ట్ర కేబినెట్ సిఫారసు మేరకు ఆయన ప్రొరోగ్ చేశారన్నారు. ఈ విషయంలో ఎటువంటి అయోమయం లేదన్నారు. 


Updated Date - 2022-02-13T21:47:41+05:30 IST