మోదీ.. ఉద్యోగమివ్వు!

ABN , First Publish Date - 2021-02-23T08:15:11+05:30 IST

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. గత కొద్దిరోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు. ఉద్యోగాలపై అంత ఘనంగా మాట్లాడిన నరేంద్ర మోదీ సర్కారు ఆరేళ్ల పాలనలో దిగజారిన ‘ఉద్యోగాల కల్పన’ దుస్థితికి నిదర్శనమిది...

మోదీ.. ఉద్యోగమివ్వు!

  • ట్విటర్‌లో టాప్‌ ట్రెండింగ్‌ హ్యాష్‌ ట్యాగ్‌
  • ‘‘మోదీ.. రోజ్‌గార్‌ దో (మోదీ.. ఉద్యోగమివ్వు)’’
  • ప్రధాని మోదీ ఆరేళ్ల పాలనలో పెరిగిన నిరుద్యోగం
  • 20-24 ఏళ్ల వయసువారిలో 37శాతం నిరుద్యోగులే
  • వారిలో 63 శాతం మంది పట్టభద్రులే: సీఎంఐఈ
  • డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికే ఉద్యోగం!
  • మొత్తం ఉద్యోగుల్లో 30 ఏళ్లలోపువారు ఐదోవంతు
  • ఉద్యోగాల్లో యువ శక్తి లేకుంటే దీర్ఘకాలంలో కష్టం
  • దేశ పురోభివృద్ధిపై ప్రభావం చూపే చాన్స్‌: నిపుణులు


ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. గత కొద్దిరోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు. ఉద్యోగాలపై అంత ఘనంగా మాట్లాడిన నరేంద్ర మోదీ సర్కారు ఆరేళ్ల పాలనలో దిగజారిన ‘ఉద్యోగాల కల్పన’ దుస్థితికి నిదర్శనమిది. అవును.. మోదీ హయాంలో నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్ల సంఖ్య 63 శాతానికి చేరింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో నిరుద్యోగ రేటు 5.61శాతం కాగా.. 2020 డిసెంబరు నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజల్లో నిరుద్యోగ రేటు 7.8గా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అయితే.. సర్కారీ లెక్కలు పైకి చెప్పని విషయమేంటంటే.. దేశ పురోభివృద్ధిలో అత్యంత కీలకమైన 20-24 వయసువారిలో నిరుద్యోగ రేటు ఏకంగా 37 శాతం ఉంది. వారిలో 63 శాతం మంది పట్టభద్రులని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)’ నివేదిక చెబుతోంది. అంటే.. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉద్యోగాలు దొరకని పరిస్థితి! 20 నుంచి 24 ఏళ్లంటే.. అప్పుడే డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తయ్యే వయసు. 20 ఏళ్లకు డిగ్రీ పూర్తవుతుంది. 21 సంవత్సరాలకు ఇంజనీరింగ్‌ పూర్తవుతుంది. వారంతా ఉద్యోగాలు చేయడానికి సిద్ధం. కానీ.. అందరూ చేయడానికి తగినన్ని ఉద్యోగాలు లేని పరిస్థితి. నిరుద్యోగ రేటు ఈ ఏడాది జనవరినాటికి కొంచెం తగ్గి.. 7.1 శాతానికి చేరుకుందని సీఎంఐఈ పేర్కొన్నప్పటికీ.. యువతలో ఆ రేటు చాలా ఎక్కువగా ఉంది. సీఎంఐఈ నివేదిక ప్రకారం.. 


  1. 2019 డిసెంబరు నాటికి దేశం మొత్తమ్మీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు. వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత. మిగతా నలుగురూ 30 ఏళ్లు పైబడినవారే. 30 ఏళ్లలోపు ఉద్యోగుల సంఖ్య ఏటికేడాదీ తగ్గుతూ వస్తోంది. ఉద్యోగాల్లో ఇలా యువత వాటా తగ్గడం దీర్ఘకాలంలో దేశాభివృద్ధిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  2. దేశంలోని ఉద్యోగుల్లో సగానికి పైగా 40 ఏళ్లు పైబడినవారే. కానీ.. డిజిటల్‌ మార్పు దిశగా మన దేశం చేస్తున్న కృషి ఫలించాలంటే యువశక్తి చాలా అవసరం. కానీ, వారికి ఉద్యోగాలు దొరకని దుస్థితి.
  3. పట్టణ ప్రాంతాల్లో ఎల్‌పీఆర్‌ నవంబరులో 37.1శాతం ఉండగా.. డిసెంబరు నాటికి 37.7 శాతానికి చేరింది. నిరుద్యోగ రేటు 7.1శాతం నుంచి 8.8 శాతానికి పెరిగింది. ఉద్యోగ రేటు 34.5శాతం నుంచి 34.4 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్య 12.25 కోట్ల నుంచి 12.24 కోట్లకు తగ్గింది. నిరుద్యోగుల సంఖ్య 93 లక్షల నుంచి 1.19 కోట్లకు పెరిగింది.
  4. గ్రామీణ భారతంలో సైతం ఎల్‌పీఆర్‌ 41.5శాతం నుంచి 42 శాతానికి పెరగ్గా.. నిరుద్యోగ రేటు 6.3 శాతం నుంచి 9.2 శాతానికి పెరిగింది. ఉద్యోగ రేటు 38.9 శాతం నుంచి 38.2 శాతానికి తగ్గింది. 




ఎల్‌పీఆర్‌.. చాలా తక్కువ!

మనదేశంలో లేబర్‌ పార్టిసిపేషన్‌ రేటు(ఎల్‌పీఆర్‌) 40శాతం. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఒక ఉద్యోగం చేయడానికి తగిన అర్హత ఉన్నవారు 100 మంది ఉండి, వారిలో 40 మంది మాత్రమే దరఖాస్తు చేస్తే.. దాన్నే లేబర్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ అంటారు. ఆడపిల్లలను చదివించాక ఉద్యోగాలు చేయనివ్వకపోవడం, బాగా ధనవంతులు తమ పిల్లలు చదువుకున్నాక వ్యాపారాల్లోకి తీసుకెళ్లడం, మరికొందరు విద్యావంతులు ఉన్నత చదువులు చదవడానికి మొగ్గుచూపడం.. ఇలా ఎల్‌పీఆర్‌ తక్కువగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రమాణాల ప్రకారం.. మనదేశంలో ఏటా 2 కోట్ల మంది పనిచేసే వయోపరిమితిలోకి (15-59 ఏళ్లు) వస్తారు. పైన పేర్కొన్న కారణాల మేరకు వారిలో దాదాపు 80 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఎల్‌పీఆర్‌ దాదాపు 60 శాతం దాకా ఉంటుందని అంచనా. అలా మనదేశంలో కూడా ఎల్‌పీఆర్‌ 60 శాతానికి చేరితే నిరుద్యోగ రేటు ఇంకా భారీగా ఉంటుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.


-సెంట్రల్‌ డెస్క్‌




‘‘ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది. యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. చిదంబరం గారూ.. దయచేసి చిల్లర రాజకీయాలపైన కాకుండా ఆర్థిక అంశాలకు సమయాన్ని కేటాయించండి. ఉద్యోగాలపై దృష్టి సారించండి

-2013, నవంబరు 3న నాటి గుజరాత్‌ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు.


దేశం ఉద్యోగాలను, నైపుణ్యాభివృద్ధిని, సౌభాగ్యాన్ని కోరుకుంటోంది. కాంగ్రెస్‌ వీటిని అందించలేదు కాబట్టి.. ఇది ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించివేయాల్సిన సమయం.

-2014, ఫిబ్రవరి 14న మోదీ


ఏడాదికి కోటి ఉద్యోగాలు..    -2014 ఎన్నికల ప్రచారంలో మోదీ వాగ్దానం


కరోనాకు ముందే..

కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు మూత పడ్డాయి. అందుకే నిరుద్యోగ రేటు ఎక్కువైందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, కరోనా రాకముందే మనదేశంలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉంది. 2020 మార్చిలో. అంటే.. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే దశలో.. దేశంలో దాదాపు 3.5 కోట్ల మంది దాకా నిరుద్యోగులున్నారు. కరోనా దెబ్బకు నిరుద్యోగుల సంఖ్య మరో కోటి పెరిగింది. అలాగే.. 2019-20లో దేశంలో ఉద్యోగుల సంఖ్య దాదాపుగా 40.35 కోట్లు కాగా.. ఈ ఏడాది జనవరి నాటికి ఆ సంఖ్య 40 కోట్లకు తగ్గింది. అంటే 35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు. 2016-17లో ఉద్యోగుల సంఖ్య 40.73కోట్లు. 2017-18లో ఆ సంఖ్య 40.59 కోట్లకు తగ్గింది. 2018-19కి 40.09 కోట్లకు తగ్గింది. 2019-20లో కొంచెం పెరిగినా కొవిడ్‌ దెబ్బకు మళ్లీ 40 కోట్లకు పడిపోయింది. ఇదంతా పోయిన ఉద్యోగాల లెక్క. ఏటా కొత్తగా ఉద్యోగాలు చేసే వయోపరిమితిలోకి వచ్చేవారి లెక్క దీనికి అదనం. దాని ఫలితమే.. ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘మోదీ రోజ్‌గార్‌ దో’ హ్యాష్‌ట్యాగ్‌ ఉద్యమం!                           



Updated Date - 2021-02-23T08:15:11+05:30 IST