Abn logo
May 4 2021 @ 13:42PM

Kangana Ranaut ట్విటర్ ఖాతా శాశ్వత సస్పెన్షన్

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఆమె వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఆఫ్‌లైన్‌లో హింసకు దారి తీసే అవకాశం ఉన్న ప్రవర్తనపై చర్య తీసుకోవడంలో తాము స్పష్టంగా ఉన్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.


ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం మాట్లాడుతూ, ఆఫ్‌లైన్‌లో హాని జరగడానికి దారి తీసే అవకాశం ఉన్న ప్రవర్తనపై గట్టి చర్య తీసుకోవడం పట్ల తాము స్పష్టంగా ఉన్నామన్నారు. ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తుండటంతో కంగన రనౌత్ ట్విటర్ అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్వేష ప్రవర్తన, విధానం, దూషణ ప్రవర్తన విధానాలను ఈ అకౌంట్ ఉల్లంఘిస్తోందని వివరించారు. తమ వేదికపై ట్విటర్ రూల్స్‌ను అందరికీ నిష్పాక్షికంగా, న్యాయంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై జర్నలిస్ట్, పొలిటీషియన్ స్వపన్ దాస్‌గుప్తా చేసిన ట్వీట్‌కు కంగన రనౌత్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2000వ సంవత్సరం ప్రారంభంలో ప్రదర్శించిన విరాట్ స్వరూపంతో మమత బెనర్జీని లొంగదీయాలని కంగన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. బహుశా ఈ ట్వీట్ ఆమె ట్విటర్ అకౌంట్‌ను పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడానికి దారి తీసి ఉండవచ్చునని తెలుస్తోంది. 


కంగన ట్వీట్‌పై తీవ్ర దుమారం రేగింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. తన  అకౌంట్‌ను పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడంపై కంగన ఇంకా స్పందించలేదు. బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో స్పందించారు. జనాన్ని హత్య చేస్తుండటం, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతుండటం, ఇళ్లను తగులబెడుతుండటం వంటివాటికి సంబంధించిన కలవరపరిచే వార్తలు, వీడియోలు, ఫొటోలు వస్తుండటం పట్ల చాలా ఆవేదన చెందుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. 


జాతీయంమరిన్ని...

Advertisement