'కిల్లర్' చెప్పిన సంచలన నిజం !

ABN , First Publish Date - 2020-10-01T22:40:20+05:30 IST

జపాన్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తొమ్మిది మందిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

'కిల్లర్' చెప్పిన సంచలన నిజం !

టోక్యో: జపాన్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తొమ్మిది మందిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యలకు అతడు తన ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా తనకు పరిచయమైన వారిని అమానుషంగా చంపేశాడు. తకాహిరొ షిరాయిషి(29) అనే హంతకుడు ఇలా తొమ్మిది వరుస హత్యలతో జపాన్‌లో 'ట్విట్టర్ కిల్లర్‌'గా మారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడిన షిరాయిషిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అతని తరఫు న్యాయవాది బాధితుల అనుమతితోనే వారిని చంపినట్లు వాదించారు. ఈ తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని, దాంతో తన క్లయింట్ వారికి సహకరించారని లాయర్ కోర్టుకు తెలియజేశారు.


షిరాయిషిని హత్య చేసిన తొమ్మిది మందిలో 15 నుంచి 26 ఏళ్ల వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన వారిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే తాను సహాయం చేస్తానని చెప్పేవాడు. తాను కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు వారిని నమ్మించేవాడు. అనంతరం వారిని తన ఇంటికి ఆహ్వానించి చంపేసేవాడు. హతమార్చిన తర్వాత వారి శరీర భాగాలను ముక్కలుగా చేసి బాక్సుల్లో భద్రపరిచేవాడు. దీనికోసం షిరాయిషి తన ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. 


షిరాయిషి బండారం బయటపడిందిలా...

23 ఏళ్ల ఓ యువతి 3 ఏళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన అనంతరం కనిపించకుండా పోయింది. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చింది. దాంతో ఆమె ట్విట్టర్ ఖాతాను తెరవడంతో అసలు విషయం బయటపడింది. షిరాయిషీతో ఆమె తరుచూ ట్విట్టర్‌లో సంప్రదించినట్టు సోదరుడు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షిరాయిషిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు విస్తుగొలిపే విషయాలు చెప్పాడు. తాను తొమ్మిది మందిని చంపానని, అది కూడా వారి సమ్మతితోనే హత్యచేసినట్లు తెలిపాడు. హతమార్చిన తర్వాత వారి శరీర భాగాలను వేరు చేసి డబ్బాల్లో దాచిపెట్టానని చెప్పాడు. దాంతో పోలీసులు అతని ఇంటి కింది భాగంలో నిర్మించుకున్న ఓ ప్రత్యేక గదిని కనుగొన్నారు.


అందులో కనిపించకుండా పోయిన 9 మంది మృతదేహాలు, వాటికి సంబంధించిన 240 ఎముకలను పోలీసులు గుర్తించారు. శరీర భాగాలను ముక్కలుగా చేసి బాక్సుల్లో దాచిపెట్టాడు షిరాయిషి. దీంతో అతడిపై హత్య, అత్యాచారం కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ప్రస్తుతం విచారణదశలో ఉన్న ఈ కేసులో షిరాయిషి దోషిగా తేలితే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. అయితే, నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తన క్లయింట్ బాధితుల సమ్మతితోనే వారి చావుకు సహకరించాడు కనుక ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కోరారు. మరోవైపు పోలీస్ అధికారులు మాత్రం లాయర్ వాదనలను తప్పుబట్టారు. మృతుల తల భాగం వెనుకవైపు గాయాలను గుర్తించామని, షిరాయిషి కావాలనే వారిని హతమార్చి ఉంటాడని  చెబుతున్నారు.

Updated Date - 2020-10-01T22:40:20+05:30 IST