ట్విటర్ ఖాతా స్తంభనపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-13T17:51:50+05:30 IST

ట్విటర్ మార్గదర్శకాలు ఉల్లంఘించారంటూ తన ఖాతాను స్తంభింపజేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ..

ట్విటర్ ఖాతా స్తంభనపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ట్విటర్ మార్గదర్శకాలు ఉల్లంఘించారంటూ తన ఖాతాను స్తంభింపజేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ట్విటర్ చర్య భారత రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అన్నారు. భారత రాజకీయాలను వ్యాపారంగా ఒక కంపెనీ మలుచుకోవడం ఒక రాజకీయవేత్తగా తనకు ఇష్టం ఉండదని అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, పార్లమెంటులో విపక్షాలను మాట్లాడనీయడం లేదని, మీడియాను తమ నియంత్రణలో పెట్టుకున్నాంటున్నారని రాహుల్ వరుస ఒక వీడియోలో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.


ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబాన్ని రాహుల్ ఈనెల 4న పరామర్శించారు. ఏడుస్తున్న కుటుంబ సభ్యుల చేతులు పట్టుకుని ఓదార్చారు. ఆ ఫోటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధిత కుటుంబ వివరాలు బయటకు వచ్చేటట్టు చేశారనే ఫిర్యాదులు రావడంతో ఈనెల 6న రాహుల్ ఖాతాను ట్విటర్ తాత్కాలికంగా స్తంభింపజేసింది. దీనిపై రాహుల్ తాజాగా స్పందిస్తూ, తటస్థ వేదికగా ఉండాలనే ఐడియాను ట్విటర్ ఉల్లంఘంచిందని అన్నారు. ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇది రాహుల్ మీద దాడి కాకుండా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. ''నాకు 19 నుంచి 20 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. స్వేచ్ఛగా అభిప్రాలు చెప్పకుండా వారిని నిరికాకరించేలా మీ చర్య ఉంది'' అని ట్విటర్ చర్యను ఖండించారు. ప్రభుత్వం పక్షాన ఉన్నారనే కారణంగా భారత రాజకీయాలను నిర్వచించేందుకు విదేశీ కంపెనీలను అనుమతించదలచుకున్నారా అని దేశ ప్రజానీకాన్ని రాహుల్ ప్రశ్నించారు. మన రాజకీయాలను మనం నడుపుకోలేమా, నిర్వచించుకోలేమా? ఇదే ఇప్పుడు మన అందరి ముందున్న ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-13T17:51:50+05:30 IST