ట్విటర్ అనూహ్య నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-13T23:59:53+05:30 IST

భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను

ట్విటర్ అనూహ్య నిర్ణయం

న్యూఢిల్లీ : భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మనీశ్ మహేశ్వరికి అమెరికాలో నూతన బాధ్యతలను అప్పగించింది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించే విషయంలో భారత ప్రభుత్వంతో ట్విటర్ ఢీకొంటున్న సంగతి తెలిసిందే. 


ఇకపై ట్విటర్ ఇండియా కార్యకలాపాలు ‘లీడర్‌షిప్ కౌన్సిల్’ మార్గదర్శకత్వంలో జరుగుతాయని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపారు. ట్విటర్ ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్స్ ట్విటర్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. మనీశ్ శాన్ ఫ్రాన్సిస్కోలో నూతన బాధ్యతలను చేపడతారని చెప్పారు. నూతన మార్కెట్ అవకాశాలపై ప్రధాన దృష్టితో రెవిన్యూ స్ట్రాటజీ, కార్యకలాపాల విభాగం సీనియర్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 


ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ యు-సున్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గడచిన రెండేళ్లకుపైగా మా భారతీయ వ్యాపారానికి నాయకత్వం వహించినందుకు మనీశ్ మహేశ్వరికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్ల కోసం అమెరికా కేంద్రంగా రెవిన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా మీరు కొత్త పాత్ర పోషించబోతున్నందుకు అభినందనలు. ట్విటర్‌కు ముఖ్యమైన అభివృద్ధి అవకాశానికి మీరు నాయకత్వం వహించడం చూడాలని ఆత్రుతగా ఉంది’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-13T23:59:53+05:30 IST