మా విధానాలే మాకు ముఖ్యం

ABN , First Publish Date - 2021-06-19T07:14:47+05:30 IST

తమ కంపెనీ విధానాలు తమకు అత్యంత ముఖ్యమని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ట్విటర్‌ తేల్చి చెప్పింది. వాటినే తాము పాటిస్తామని స్పష్టం చేసింది. అదే

మా విధానాలే మాకు ముఖ్యం

వాటినే మేం పాటిస్తాం

ఐటీ స్థాయీ సంఘం ఎదుట ట్విటర్‌

భారతీయ చట్టాలు అమలు చేయకుంటే 

జరిమానాలు తప్పవని ఎంపీల హెచ్చరిక

పౌరుల హక్కుల రక్షణకు స్థాయీ సంఘంతో కలిసి పని చేస్తాం: ట్విటర్‌

భారతీయ చట్టాలు ఎంత ముఖ్యమో మా విధానాలూ అంతే ముఖ్యం..

ఐటీ స్థాయీ సంఘం ఎదుట ట్విటర్‌ 

పార్టీలకతీతంగా మండిపడిన ఎంపీలు


న్యూఢిల్లీ, జూన్‌ 18: తమ కంపెనీ విధానాలు తమకు అత్యంత ముఖ్యమని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ట్విటర్‌ తేల్చి చెప్పింది. వాటినే తాము పాటిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో, భారతీయ చట్టాలను ట్విటర్‌ గౌరవిస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఎదుట శుక్రవారం ట్విటర్‌ ప్రతినిధులు పబ్లిక్‌ పాలసీ మేనేజర్‌ షగుఫ్తా కమ్రన్‌, లీగల్‌ కౌన్సెల్‌ అట్సుషి కపూర్‌ హాజరయ్యారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాల దుర్వినియోగాన్ని నివారించడం, పౌరుల హక్కులను రక్షించడం అనే అంశాలపై తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా స్థాయీ సంఘంలోని ఎంపీలు దాదాపు 95 నిమిషాలపాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.


భారతీయ చట్టాలే అత్యుత్తమమని, వాటిని పాటించి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. భారత్‌లో పూర్తి స్థాయి చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిని ఎందుకు నియమించలేదు? సమస్యలు సృష్టించే.. మరీ ముఖ్యంగా మత ఘర్షణలకు కారణమయ్యే కంటెంట్‌పై మీ విధానం ఏమిటి? అంటూ కఠినమైన ప్రశ్నలను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఓ బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా ఘజియాబాద్‌ ఘటన గురించి అడిగినట్లు తెలిసింది. ఇందుకు జవాబుగా, తమ విధానాలనే తాము పాటిస్తామని వారు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆరోగ్యకరమైన ట్వీట్లు అనుకున్న వాటినే ప్రోత్సహిస్తామని, అనారోగ్యకరమని అనుకున్న వాటిని ప్రోత్సహించేది లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ వాదనతో కమిటీ ఏకీభవించలేదని సమాచారం. ట్విటర్‌ వైఖరి ఐటీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఉందని ఓ ఎంపీ స్పష్టం చేశారని తెలిసింది. భారతీయ చట్టాల కంటే మీరు అధికులు కాదని బీజేపీ ఎంపీలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఉల్లంఘనలు కొనసాగితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ట్విటర్‌ పాలసీ కూడా ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. భారత ప్రభుత్వ చట్టాలు ఎంత ముఖ్యమో తమ విధానాలు కూడా అంతే ముఖ్యమని, ఈ విషయంలో రాజీ లేదని ట్విటర్‌ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఒకరు చెప్పారు.


దాంతో, ప్రతిపక్ష ఎంపీలు సహా స్థాయీ సంఘంలోని ప్రతి ఒక్కరూ ఇక్కడి చట్టమే సుప్రీమ్‌ అని, మీ విధానాలు కాదని విస్పష్టంగా తేల్చి చెప్పారు. ట్విటర్‌ మొండి వైఖరిని తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రా కూడా దునుమాడారు. ఇక, చాలా అంశాలపై ట్విటర్‌ ప్రతినిధులు అస్పష్టంగా, డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నిబంధనలు పాటించడంలో జాప్యానికి కొవిడే కారణమని అన్నట్లు తెలిసింది. దాంతో, కంపెనీలో మీ హోదా ఏమిటి? ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మీకున్న అధికారాలు ఏమిటి? లిఖితపూర్వకంగా తెలియజేయాలని స్థాయీ సంఘం వారికి స్పష్టం చేసింది. 


ట్విటర్‌ ఎండీకి ఘజియాబాద్‌ పోలీసుల నోటీసులు

వారం రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలంటూ ట్విటర్‌ ఎండీ మనీశ్‌ మహేశ్వరికి ఘజియాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ ముస్లిం వృద్ధుడిపై దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ట్విటర్‌ ఎండీ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయుతే, ఈ అంశంపై స్పందించేందుకు ట్విటర్‌ నిరాకరించింది. తటస్థ హోదాను కోల్పోయిన తర్వాత ట్విటర్‌పై నమోదైన తొలి కేసు ఇదే. 

Updated Date - 2021-06-19T07:14:47+05:30 IST