Jun 23 2021 @ 21:38PM

‘మా’ వార్‌: ఓట్లు చీల్చేందుకేనా.. సంఖ్య పెరుగుతోంది!

వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలుంటాయ్‌. చుక్కలకుంట దగ్గర 3 సుమోలుంటాయ్‌. సరివితోపు చివరలో 5 సుమోలుంటాయ్‌.. అంటూ 'అతడు' సినిమాలో బ్రహ్మాజీ డైలాగ్‌ చెబుతుంటే.. 'అన్ని బళ్ళు ఎందుకురా బుజ్జా? పెళ్లికి కానీ వెళుతున్నామా!' అంటూ తనికెళ్ల భరణి ఇచ్చే రియాక్షన్‌ ఉంటుంది చూశారూ..! అలాంటి రియాక్షనే ఇప్పుడు టాలీవుడ్‌ పరిశ్రమలోని నటీనటులు ఇస్తున్నారు. మరి లేకపోతే ఏంటి? తిప్పి కొడితే.. 1000 ఓట్లు కూడా లేని 'మా' అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే నలుగురు బరిలోకి దిగారు. అదిగో ఇదిగో అనేసరికి మరో ఇద్దరు ముగ్గురు లైన్‌లోకి వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కూడా సిద్ధమవుతున్నారనేలా ఇండస్ట్రీలో వార్తలు వినవస్తున్నాయి. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమతో పాటు సాయికుమార్‌ కూడా ఈ పోటీలోకి అడుగుపెడితే.. ఎలక్షన్‌ రసవత్తరంగా ఉండొచ్చు కానీ.. ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలియనంతగా గందరగోళం నెలకొనడం మాత్రం ఖాయం. అసలెందుకు 'మా' ఎన్నికలు ఇంత హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి? ఇంతమంది పోటీ వెనుక ఏమైనా స్కెచ్‌లు ఉన్నాయా? విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ ఎవరికి ఉంది? అనేవి ఒక్కసారి పరిశీలిద్దాం. 


ప్రస్తుతానికైతే నలుగురు సభ్యులు.. 'అధ్యక్ష' పదవి కోసం పోటీపడుతున్నారనేది కన్ఫర్మ్‌ అయ్యింది. సాయికుమార్‌ కూడా యాడ్‌ అయితే 5 గురు. అంటే 5 ప్యానల్స్‌కి సభ్యులు కావాలి. ఒక్కో ప్యానల్‌కి దాదాపు ఓ 20 మంది కావాలి. ఇక్కడే 100 ఓట్లు 5 రకాలుగా చీలిపోతాయి. ఇంకా ఉన్న ఓట్లలో ఎంతమంది తమ ఓటును వినియోగించుకుంటారో చెప్పలేం. ఎందుకంటే 100 పర్సంట్‌ ఓటింగ్‌ ఈ మధ్య కాలంలో అయితే ఏ ఎన్నికలలో నమోదు కావడం లేదు. మరోవైపు కరోనా భయం ఒకటుంది. సెప్టెంబర్‌కి పరిస్థితి ఎలా ఉంటుందో? తెలియదు కాబట్టి.. అసోసియేషన్‌ సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 'మా' కుర్చీ కోసం ఈ రకపు ఫైట్‌లో అసలు అర్థమే లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక గత కొంతకాలంగా ఇండస్ట్రీని పరిశీలిస్తే.. ఇక్కడ వర్గపోరు ఎక్కువగా ఉందనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. మాములుగా బయటపడకపోయినా.. ఇలాంటి సందర్భాలలో ఆర్టిస్ట్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరి ఎవరేంటి అనేది రివీల్‌ అవుతుంటుంది. కొందరికి ఈగో ఇష్యూస్‌, ఇంకొందరికీ క్యాస్ట్‌ ఫీలింగ్స్‌.. వెరసీ- అసలు 'మా' స్వరూపమే మారిపోతుంది. 'మా' ఎందుకు స్థాపించబడిందనే అర్థమే దూరమవుతుంది. రాజేంద్రప్రసాద్‌- జయసుధ పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో తెలియంది కాదు. అలాగే శివాజీరాజా-నరేష్‌ పోటీ సమయంలో ఎటువంటి వాతావరణం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటివే 'మా' ఎన్నికలను హాట్‌ టాపిక్‌ అయ్యేలా చేస్తున్నాయి. ఆ పీఠం వెనుక ఏదో మూట ఉందనేలా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఉంది కాబట్టేగా.. సుమోల లెక్కన పోటీ చేసేవారి సంఖ్య పెరుగుతోంది అంటారా?. ఏమో వారికే తెలియాలి. అంతే కాదు, ఇలా సంఖ్య పెరగడం వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం.


'మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన' అన్నట్లుగా ఎంతమంది ఈ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే.. స్కెచ్‌ వేసే వారికి విజయం అంత సునాయాసం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అదెలా అంటే.. ఓట్లు చీల్చడం. దీని గురించి ఏపీలో జరిగిన ఎన్నికలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి వర్సెస్‌  వీకే నరేష్‌ (మా ప్రస్తుత అధ్యక్షుడు) అనేలా ప్రస్తుత ఫైట్‌ మారనున్నట్లుగా ఇండస్ట్రీ పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారు. అదెలా అంటే.. మాములుగా అయితే మెగాస్టార్‌ మద్దతు ఇస్తే.. దాదాపు గెలుపు ఖాయం అనేలా ఇప్పటి వరకు 'మా' ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు పోటీ చేసే వారి సంఖ్య పెరిగితే.. ఎవరి అభిమానం ప్రకారం వారికి ఓట్లు పడి, ఓటింగ్‌ చీలే అవకాశం ఉంది. వీకే నరేష్‌ విషయానికి వస్తే.. ఆయన కనుసన్నల్లో 105 ఓట్లు ఉన్నట్లుగా.. ఆయన ఎవరికి మద్దతు ఇస్తే.. వారికి ఆ ఓట్లు పడతాయనేలా ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఇలా చూస్తే.. ఆయన ఎవరికి మద్దతిస్తే.. వారు ఈసారి గెలిచే అవకాశం లేకపోలేదు. ఒక్క ఓటు విన్నర్‌ని డిసైడ్‌ చేసే పరిస్థితులు నెలకొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి ఆసక్తికర పరిణామాల నడుమ.. ఈసారి 'మా' అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో.. తెలియాలంటే సెప్టెంబర్‌ వరకు వెయిట్‌ చేయక తప్పదు.