GHMC జోనల్‌ కమిషనర్ల బదిలీల్లో ట్విస్ట్‌.. ఆ అధికారా మజాకా.. ఒక్కరోజులోనే మార్పు.. మెండుగా మంత్రి అండదండలు..!?

ABN , First Publish Date - 2021-10-28T16:23:16+05:30 IST

జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్ల బదిలీల్లో పైరవీలు బాగా ప్రభావం చూపాయి...

GHMC జోనల్‌ కమిషనర్ల బదిలీల్లో ట్విస్ట్‌.. ఆ అధికారా మజాకా.. ఒక్కరోజులోనే మార్పు.. మెండుగా మంత్రి అండదండలు..!?

  • యథాస్థానంలో కొనసాగింపు
  • జీహెచ్‌ఎంసీలో పలువురు జోనల్‌ కమిషనర్లకు స్థానచలనం

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్ల బదిలీల్లో పైరవీలు బాగా ప్రభావం చూపాయి. మంగళవారం రాత్రి జారీ అయిన ఉత్తర్వుల్లో బుధవారం సాయంత్రానికి చాలా మార్పులు జరిగాయి. ఎప్పటిలానే ఓ అధికారి తనకు నచ్చిన చోట యథావిధిగా కొనసాగేలా విజయవంతంగా మార్పు చేయించుకోగలిగారు. డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు గతంలో కూడా ఆ అధికారి బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను గంటల వ్యవధిలో మార్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పుడూ అదే జరిగింది. ఓ మంత్రి అండదండలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బల్దియాలో పలువురు జోనల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌, ఖైరతాబాద్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న రవికిరణ్‌కు ఖైరతాబాద్‌ రెగ్యులర్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డికి నల్గొండ మునిసిపాలిటీకి స్థానచలనం కలిగింది. కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి ప్రియాంకను శేరిలింగంపల్లి కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న ఎస్‌. పంకజను కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా, అక్కడి కమిషనర్‌ మమతను ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.


బుధవారం సాయంత్రానికి ఉత్తర్వుల్లో మార్పులు జరిగాయి. కూకట్‌పల్లిలో మమత యథావిధిగా కొనసాగనుండగా, ఇక్కడ బాధ్యతలు తీసుకోవాల్సిన పంకజకు ఎల్‌బీనగర్‌ అప్పగించారు. గతంలోనూ మమత డీసీగా ఉన్నప్పుడు జరిగిన బదిలీల్లోనూ మర్నాడే మార్పులు జరిగాయి. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పంకజ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నా.. వాస్తవాలు వేరే ఉన్నాయన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-10-28T16:23:16+05:30 IST