బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్

ABN , First Publish Date - 2021-01-14T00:07:11+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హఫీజ్‌పేట్‌ భూవివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హఫీజ్‌పేట్‌ భూవివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు.. ప్రవీణ్‌ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ ఘటనకు కొన్ని రోజుల ముందు కూడా మీటింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ భేటీల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారెవరు? ఏయే అంశాలపై చర్చించారు? అనే కోణాలపై దృష్టిసారించారు. చర్చలు విఫలమవ్వడంతోనే కిడ్నాప్‌ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


ఈ కేసులో ఏ1 అఖిలప్రియ ఇప్పటికే అరెస్టవ్వగా.. ఏ2 సుబ్బారెడ్డిని విచారించి, వదిలేశారు. అయితే.. డీసీపీకి ఫోన్‌కాల్‌ వచ్చిన నంబరు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్‌.. మియాపూర్‌లో ఉంటూ.. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ వద్ద పీఏగా పనిచేస్తున్నట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. అతడితోపాటు.. ఏపీలోని అనంతపురం జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బోయ సంపత్‌కుమార్‌, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ దొర్లు బాలచెన్నయ్యకు కూడా ఫోన్‌కాల్స్‌ వెళ్లడంతో.. వారిద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణలో వారు కిడ్నాప్‌ స్కెచ్‌ మొదలు.. పథకం అమలు దాకా జరిగిన పరిణామాలను పోలీసులకు వివరించారు. అఖిలప్రియతోపాటు.. మొత్తం 19 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. 

Updated Date - 2021-01-14T00:07:11+05:30 IST