Abn logo
Jun 17 2021 @ 08:45AM

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌న్నాహాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సమావేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన‌ వైద్య సామ‌గ్రిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య స‌దుపాయాల అందుబాటుపై కూడా అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.  క‌రోనా సెకెండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని, థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. 

ఆసుప‌త్రుల‌లో మందులు, ఆరోగ్య సౌకర్యాలు, పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు. మహారాష్ట్రలో వ్యాక్సిన్ లభ్యత గురించి ఠాక్రే మాట్లాడుతూ ఆగస్టు,సెప్టెంబర్ నాటికి రాష్ట్రానికి 42 కోట్ల మోతాదులు అంద‌నున్నాయ‌ని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్క‌టే మార్గ‌మ‌న్నారు. అయితే మాస్కులు ధరించడం, పరిశుభ్రత, సోష‌ల్ డిస్టెన్సింగ్ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌టీ-పీసీఆర్ కిట్లు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ఔషధాల కొనుగోలు, వాటికి నిధుల స‌ద్దుబాటు గురించి కూడా చర్చించారు. ఫ‌స్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో బాధితులు సంఖ్య రెట్టింపు కావడంపై సమావేశంలో చ‌ర్చించారు.