జననాయకుని ఇరవైఏళ్ల పాలన

ABN , First Publish Date - 2022-05-17T06:31:25+05:30 IST

కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బతికించాలన్న అంశంపై ఉదయపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన 400కు మందికి పైగా మేధావులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న సమయంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశం సాధిస్తున్న...

జననాయకుని ఇరవైఏళ్ల పాలన

కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బతికించాలన్న అంశంపై ఉదయపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన 400కు మందికి పైగా మేధావులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న సమయంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశం సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షాతో సహా అనేకమంది పెద్దలు ప్రపంచానికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని రాహుల్ గాంధీ ఉదయపూర్‌లో ఆవేదనను వ్యక్తం చేస్తున్న సమయంలోనే విజ్ఞాన్ భవన్‌లో మోదీ జీవితం ప్రజల జీవితాలతో ఏవిధంగా మమేకమైనది, రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవనంలో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ భారతీయ జనతా పార్టీని దేశంలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయన ఏ విధంగా దోహదం చేశారు అన్న అంశంపై దేశంలోని ప్రముఖులు రచించిన వ్యాసాలతో ‘Modi@20’ అన్న సంకలనాన్ని విడుదల చేశారు. దేశంలో రాజకీయ పరిస్థితిని ఈ రెండు సమాంతర ఘటనలే మనకు స్పష్టం చేస్తాయి.


‘Modi@20’ పుస్తకం సామాజిక సేవా రంగంలోను, రాజకీయాల్లోనూ ఉన్న వారికి, ఒక పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలనుకున్న వారికి భగవద్గీత లాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఉద్ఘాటించారు. ఆయన అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే ఈ పుస్తకంలో రచనలు చేసిన, అభిప్రాయాలు వెల్లడించిన అత్యధికులు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేనివారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆర్థిక వేత్తలు సుర్జిత్ భల్లా, అనంత నాగేశ్వరన్, అరవింద పనగ్రియా, శామికా రవి, ప్రముఖ వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్ర, శోభనా కామినేని, అజయ్ బంగా తదితరులు మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల, ఇన్ఫోసిస్ మాజీ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నారాయణ హృదయాలయ చైర్మన్ దేవి షెట్టి, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సినీ నటుడు అమీర్ ఖాన్, సంఘ సేవకురాలు సుధామూర్తి, సద్గురు మొదలైన వివిధ రంగాలకు చెందిన వారు ఈ పుస్తకంలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ దేశంలో యువకులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు, సంఘసేవకుల నుంచి ఆధ్యాత్మికవేత్తలు మోదీ గురించి, ఆయన సారథ్యంలో భారత దేశంలో జరుగుతున్న ప్రగతి గురించి ఏమనుకుంటున్నారో ఈ పుస్తకం విశదం చేసింది.


1970లలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా, 1980లో బిజెపి కార్యకర్తగా పనిచేసిన నరేంద్రమోదీ తనకు అప్పజెప్పిన ఎటువంటి పనినైనా సాధించి తీరుతారని, ఆయన కార్యసాధకుడని మోదీతోపాటు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉన్న అమిత్ షా ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. 1987లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మోదీకి తొలిసారి పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించారు. పార్టీని గెలిపించడమే కాదు, మేయర్ పదవిని కూడా ఆయన సాధించి పెట్టారు. అదే విధంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో పార్టీ ఇన్‌ఛార్జిగా పనిచేసి బిజెపి అంటే ఏమిటో దేశ ప్రజలకు తెలియజేశారు. పార్టీ బలం, సంఘ్ పరివార్ బలం రెండింటినీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో మోదీకి బాగా తెలుసునని, ఆయన ప్రతి అంశాన్నీ కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాతే వ్యూహరచన చేస్తారని అమిత్ షా చెప్పారు. లేకపోతే 1989–2014 మధ్య సంకీర్ణ రాజకీయాలు, కుటుంబ పాలన, అవినీతి సామ్రాజ్యాలు, ఉగ్రవాదంతో రాజీపడడం, బలహీనులైన ప్రధానమంత్రులు వంటి సమస్యలతో దేశం అతలాకుతలమైన సమయంలో ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించి అయిదు దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీతో బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో స్థాపించడం అంత సులభమైన పని కాదని ఆయన అన్నారు. 30 నుంచి 40 శాతం వరకు ఓట్లు సాధించగల ఇతర పార్టీ నేతలను తమ వైపుకు తిప్పుకుని వారి ద్వారా మెజారిటీ ఎలా సాధించగలమో మోదీ చెప్పారని అమిత్ షా తెలిపారు.


కలలు కనడం మాత్రమే కాదు, కలల్ని ఏ విధంగా సార్థకం చేసుకోవచ్చునో మోదీ ప్రపంచానికి రుజువు చేశారని, స్వతంత్ర భారత చరిత్రలో ఒక అద్వితీయమైన స్థానాన్ని మోదీ సంపాదించుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ చెప్పినప్పుడు విజ్ఞాన్ భవన్‌లో కరతాళ ధ్వనులు మ్రోగాయి. మోదీని దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మరణానికి కొద్ది రోజుల ముందు రాసిన వ్యాసంలో చెప్పడం సాధారణ విషయం కాదు. ఈ దేశ సంస్కృతిని, వారసత్వాన్నీ మోదీ పరిరక్షించారని ఆమె అభిప్రాయపడ్డారు. పివి సింధు లాంటి యువ క్రీడాకారిణి మోదీని ఈ దేశంలో యువతకు ప్రతీకగా అభివర్ణించారు. ‘అయితే అవుతుంది’ అనే ‘చల్నే దేవ్’ వైఖరి మోదీకి లేదని, సాధించి తీరాలనే పట్టుదల ఆయన ప్రధాన లక్షణమని పివి సింధు అన్నారు. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంలు మోదీ హయాంలో పెద్ద ఎత్తున పెరిగిన వైనాన్ని ఆమె వివరించారు. మోదీ సారథ్యంలో ఈ దేశంలో క్రీడారంగంలో ప్రతి క్రీడాకారుడికీ ఆత్మవిశ్వాసం పెల్లుబుకుతోందని ఆమె చెప్పారు. స్టార్టప్ ఇండియాలో 81 శాతం, ముద్రా యోజనలో 70 శాతం మహిళలు ఉన్నారంటే మోదీ హయాంలో స్త్రీ శక్తికి లభించిన ప్రాధాన్యానికి సంకేతమని శోభనా కామినేని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాతృత్వ శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిపోయిందని ఆమె చెప్పారు. మోదీ హయాంలో భారత దేశ సౌరశక్తి 2.6 గిగావాట్ల నుంచి 37 గిగావాట్లకు పెరిగిందని, ఆయన మొదటి అయిదేళ్లు దేశ అభివృద్ధిపై దృష్టి సారించారని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రధాన స్థానం పొందడం గురించి యోచిస్తున్నారని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా అన్నారు. 2014 నుంచి ప్రతి ఏటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతోందని, ఇప్పుడు 40 బిలియన్ డాలర్ల చొప్పున పెరగడం ప్రారంభించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెప్పారు. గుజరాత్‌లో వైబ్రంట్ గుజరాత్ సందర్భంగా మోదీ విశ్వరూపాన్ని చూశానని, ఆయన మూలంగా ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకున్నానని ప్రముఖ ఆర్థికవేత్త, నీతీ ఆయోగ్ తొలి వైస్ చైర్మన్ అరవింద్ పనగ్రియా చెప్పారు. మోదీ దృష్టి ప్రధానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన, గ్రామాల్లో విద్యుద్దీకరణ, గ్రామాల అభివృద్ధిపైనే ఉంటుందని మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేన్ మిశ్రా స్వానుభవంతో చెప్పారు. 


‘ఈ దేశంలో పరివర్తనా ప్రభంజనం వీస్తోంది’ అని సంఘసేవకురాలు, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి ‘Modi@20’ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ఈ పరివర్తనా ప్రభంజనంలో కొట్టుకుపోకుండా తమను తాము కాపాడుకోవడం ప్రతిపక్షాలకు అంత సులభం కాదు. ఉదయ్‌పూర్ లాంటి ఎన్నో మేధో మథన సదస్సులు జరిపినా మోదీ వెలుగులో ప్రకాశిస్తున్న భారతదేశంలో నిలదొక్కుకోవడం కాలం చెల్లిన కాంగ్రెస్ నేతలకు సాధ్యం కాదు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-05-17T06:31:25+05:30 IST