9/11 దాడికి ఇరవయ్యేళ్లు!

ABN , First Publish Date - 2021-09-12T08:02:48+05:30 IST

ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద దాడి అయిన న్యూయార్క్‌ 9/11 ఘటనకు శనివారంతో ఇరవయ్యేళ్లు నిండిన సందర్భంగా బాధిత దేశం ..

9/11 దాడికి ఇరవయ్యేళ్లు!

3 చోట్ల అమెరికా స్మారక కార్యక్రమాలు


న్యూయార్క్‌, సెప్టెంబరు 11: ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద దాడి అయిన న్యూయార్క్‌ 9/11 ఘటనకు శనివారంతో ఇరవయ్యేళ్లు నిండిన సందర్భంగా బాధిత దేశం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు నాటి ఘటనను గుర్తు చేసుకున్నాయి. ఆతాహుతి దళం అల్‌ఖైదా ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాలను హైజాక్‌ చేసి, న్యూయార్క్‌ నడిబొడ్డున ఉన్న వరల్డ్‌ ట్రేడ్‌ టవర్స్‌ను, రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న పెంటగన్‌ భవనాన్ని ఢీకొట్టి నేలమట్టం చేసిన ఘటన ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతి పరచింది. నాటి ఘటనలో మూడు వేల మందికి పైగా మరణించారు. ఆ తర్వాత ఇరవయ్యేళ్లుగా అమెరికా ఉగ్రవాద మూకల వేట పేరిట అరబ్బు, ఆసియా దేశాల్లో భారీ ఎత్తున దాడులు చేసింది. లక్షల సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. 9/11 దాడుల సూత్రధారికి ఆశ్రయం ఇచ్చారన్న కోపంతో అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన అమెరికా ఇరవయ్యేళ్ల తర్వాత ఆ తాలిబన్లకే ప్రభుత్వాన్ని అప్పగించి వెనుదిరిగింది. 9/11 ఘటన ఇరవయ్యేళ్ల స్మృతిని అమెరికా శనివారం ఏకతాదినంగా జరుపుకొంది.


అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాట్లాడుతూ, 9/11 ఘటన తర్వాత అమెరికా జాతిలో పెల్లుబికిన సహకార స్ఫూర్తిని జాతి తిరిగి ప్రదర్శించాలన్నారు. శనివారం ఆయన ఉగ్రవాద దాడి జరిగిన మూడు ప్రాంతాలను సందర్శించారు. న్యూయార్క్‌ వరల్డ్‌ ట్రేడ్‌ టవర్స్‌ ప్రాంతాన్ని, వాషింగ్టన్‌ పెంటగన్‌ ప్రాంతాన్ని, పెన్సెల్వేనియాలో ప్రయాణికుల తిరుగుబాటుతో కూలిపోయిన నాలుగో విమానం శిథిలాల ప్రాంతాన్ని సందర్శించారు. అయితే, ఎక్కడా బైడెన్‌ మాట్లాడలేదు. అక్కడ ప్రసంగాలను చేసే బాధ్యతను హాజరైన మాజీ అధ్యక్షులకు అప్పగించారు. నాటి సంఘటన జరిగినపుడు అధ్యక్షుడిగా ఉన్న జార్జిబుష్‌ పెన్సెల్వేనియాలో, 9/11 సూత్రధారి లాడెన్‌ను మట్టుబెట్టిన అధ్యక్షుడు ఒబామా న్యూయార్క్‌లో స్మారక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌తో మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్‌ క్లింటన్‌ వేదికను పంచుకున్నారు. నాటి ఘటన మృతుల వివరాలను చదువుతున్నపుడు బైడెన్‌ కన్నీరు పెట్టుకున్నారు. పెన్సెల్వేనియా కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు జార్జిబు్‌షతో కలిసి పాల్గొన్నారు. తాలిబాన్లతో సంధి ఒప్పందాన్ని చేసుకున్న అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం న్యూయార్క్‌ కార్యక్రమానికి వస్తానని చెప్పి చివరకు తప్పించుకున్నారు. న్యూయార్క్‌లోనే వేరే చోట మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా వైదొలగడం ఘోర తప్పిదమన్నారు. భారత ప్రధాని మోదీ నాటి దాడిని మానవాళి మీద దాడిగా అభివర్ణించారు. 

Updated Date - 2021-09-12T08:02:48+05:30 IST