Kuwait ప్రభుత్వరంగ ఉద్యోగుల్లో ప్రవాసుల వాటా ఎంతంటే..

ABN , First Publish Date - 2022-07-07T15:59:41+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తోంది.

Kuwait ప్రభుత్వరంగ ఉద్యోగుల్లో ప్రవాసుల వాటా ఎంతంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే గడిచిన ఐదేళ్లలో భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. దీంతో ఆ దేశంలో భారీ మొత్తంలో ప్రవాస ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినట్లు ఇటీవల వెలువడిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి తాజాగా వచ్చిన సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో నివేదిక ప్రకారం ప్రస్తుతం కువైత్‌లోని ప్రభుత్వ సంస్థల్లో కేవలం 19.8శాతం మంది మాత్రమే ప్రవాస ఉద్యోగులు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ దేశంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4,51,960గా ఉంది. ఇందులో విదేశీ ఉద్యోగులు 89,827 మంది మాత్రమే. అంటే 19.8శాతం మంది ప్రవాస ఉద్యోగులు ఉంటే.. 80.2 మంది స్థానికులు ఉన్నారన్నమాట. 


ఇక 2017లో సివిల్ సర్వీస్ కమిషన్(CSC) తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ వలసదారుల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. స్థానికులకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ పాలసీని కువైత్ సర్కార్ తీసుకురావడం జరిగింది. దాంతో అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 2017 నుంచి కువైటైజేషన్ పాలసీని అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో గడిచిన ఐదరేళ్లలో ఆ దేశంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలైంది. ఇటీవల వెలువడిన సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 3.70లక్షలకు తగ్గడం గమనార్హం. 2018లో 2,891,255గా ఉన్న ప్రవాసుల సంఖ్య 2021 నాటికి 2,520,301కు పడిపోయింది. ఇదే సమయంలో వర్క్ పర్మిట్ల పొందిన వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. కేవలం 11వేల మంది మాత్రమే వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. 2018లో 1,07,657 మంది వలసదారులు వర్క్ పర్మిట్లు పొందితే.. 2021లో 96,800 మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు దక్కాయి. 

Updated Date - 2022-07-07T15:59:41+05:30 IST