ఒకప్పుడు TV Anchor.. ఇప్పుడు రోడ్డుపక్కన ఆహార విక్రేత

ABN , First Publish Date - 2022-06-17T02:45:29+05:30 IST

తాలిబన్ల(Talibans) నియంత్రణలోకి వెళ్లాక ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)‌లో ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా దిగజారాయి.

ఒకప్పుడు TV Anchor.. ఇప్పుడు రోడ్డుపక్కన ఆహార విక్రేత

కాబూల్ : తాలిబన్ల(Talibans) నియంత్రణలోకి వెళ్లాక ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)‌లో ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా దిగజారాయి. ప్రస్తుతం అక్కడ తీవ్ర పేదరిక పరిస్థితులు విలయతాండవం చేస్తున్నాయి. చక్కటి నైపుణ్యమున్న ఎంతోమంది వృత్తి నిపుణులు కడు పేదరికంతో పోరాడుతున్నారు. అక్కడి దారుణ పరిస్థితులకు నిలువుటద్దం లాంటి ఓ ఘటన నెటిజన్లను కలచివేస్తోంది. గతంలో టీవీ యాంకర్‌(TV Anchor)గా పనిచేసిన ముసా మొహమ్మదీ అనే వ్యక్తి.. ఇప్పుడు బతుకుదెరువు కోసం రోడ్డుపక్కన ఆహార పదార్థాల విక్రేతగా మారిపోయాడు. హమీద్ ఖర్జాయ్(Hamid Karzai) ప్రభుత్వంలో పనిచేసిన కబీర్ హక్మాల్ అనే ఆయన ట్విటర్ వేదికగా ముసా మొహమ్మదీ(Musa Mohammadi) ఫొటోలను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘ ముసా మొహమ్మదీ ఒకప్పుడు జర్నలిస్ట్. మీడియా రంగంలో కొన్నేళ్లపాటు పనిచేశాడు. వేర్వేరు టీవీ చానళ్లలో రిపోర్టర్, యాంకర్‌గా పనిచేశాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రస్తుతం అతడికి ఎలాంటి ఆదాయం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా దిగజారడంతో బతుకుదెరువు కోసం ఆయనిప్పుడు ఆహారాన్ని విక్రయిస్తున్నాడు. కొంత డబ్బును ఆర్జిస్తున్నాడు. ఆఫ్ఘాన్‌లో గణతంత్ర ప్రభుత్వం కుప్పకూలాక అసాధారణ పేదరిక పరిస్థితులు నెలకొన్నాయి ’’ అని కబీర్ హక్మాల్ ట్విటర్‌లో వివరించారు. 


మొహమ్మదీ దారుణ పరిస్థితి సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఈ విషయం ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వసిఖ్ హృదయాన్ని కలచివేసింది. దీంతో మొహమ్మదీని తన విభాగంలో నియమించుకోబోతున్నట్టు అహ్మదుల్లా వసిఖ్ ట్వీట్ చేశారు. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశంలో మానవ, ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. మీడియా సంస్థలు, పలువురు జర్నలిస్టులను అణచివేసింది. ముఖ్యంగా నెలల వ్యవధిలో ఎంతోమంది మహిళలు ఉపాధి కోల్పోయారు.



Updated Date - 2022-06-17T02:45:29+05:30 IST