హెచ్చు తగ్గుల్లో పసుపు ధర

ABN , First Publish Date - 2021-02-23T06:03:36+05:30 IST

ఈ ఏడాది పసుపు పండించిన రైతులకు ధర కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అనే విధంగా ఉంది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి.

హెచ్చు తగ్గుల్లో పసుపు ధర
సోమవారం నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చిన పసుపు

ఖిల్లా, ఫిబ్రవరి 22 : ఈ ఏడాది పసుపు పండించిన రైతులకు ధర కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అనే విధంగా ఉంది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ధరలు హెచ్చు తగ్గులతో దోబూచులాడుతున్నాయి. యార్డ్‌కు నాణ్యమైన పసుపు తీసుకొచ్చిన రైతులకు వారు ఆశించిన మేర ధరలు పలుతోంది. గత వారం నాణ్యమైన పసుపునకు రూ.7,700 వరకు ధర పలికింది. అదే వారం పచ్చిగా ఉన్న పసుపునకు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ధరలు పలికింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు ధర ఆన్‌లైన్‌ విధానం ఆధారంగా పెరుగుతూ తగ్గుతుందని కొంద రు వ్యాపారులు తెలిపారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు నిర్మల్‌, జగిత్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్‌ జిల్లా నలుమూలల నుంచి రైతులు పసుపును తరలించారు. సుమారు 25వేల బస్తాల వరకు పసుపు యార్డ్‌కు అమ్మకానికి వచ్చింది. నాణ్యమైన పసుపునకు సుమారు రూ.7,348 వరకు ధర పలికింది. మోడల్‌ ధర రూ.6,450, అత్యల్పం రూ.4,500 పలికింది. రైతులు పచ్చిగా ఉన్న పసుపును తరలించడం వల్ల ధరలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. రైతులు దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన, బాగా ఎండిన పసుపును మాత్రమే యార్డ్‌కు తరలించి మంచి ధర పొందాల ని వారు తెలిపారు. కాగా.. సోమవారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులతో సమీక్ష జరిపారు. మార్కెట్‌యార్డులో పసుపు ధరలపై, రైతులకు అందుతున్న వసతులపై ఆయన ఆరా తీశారు. 

Updated Date - 2021-02-23T06:03:36+05:30 IST