బావిలో ఇల్లెలా కట్టాలి..?: జగనన్న ఇల్లు పథకం లబ్ధిదారుల ఆవేదన

ABN , First Publish Date - 2021-09-28T05:30:00+05:30 IST

తమకు నేలబావి ఉన్న ప్రాంతంలో ఇళ్ల స్థలం మంజూరు చేశారని, అక్కడ తామెలా ఇల్లు కట్టుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బావిలో ఇల్లెలా కట్టాలి..?: జగనన్న ఇల్లు పథకం లబ్ధిదారుల ఆవేదన
తురగవారిపాలెంలో లబ్దిదారులకు కేటాయించిన రెండు ప్లాట్‌లలో ఉన్న నేలబావి


అమరావతి, సెప్టెంబరు 28: తమకు నేలబావి ఉన్న ప్రాంతంలో ఇళ్ల స్థలం మంజూరు చేశారని, అక్కడ తామెలా ఇల్లు కట్టుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే..  జగనన్న ఇల్లు పథకంలో భాగంగా మండంలోని మునగోడు గ్రామానికి చెందిన పేదలకు శివారు గ్రామమైన తురగవారిపాలెంలో క్రోసూరు రోడ్డు వెంబడి సుమారు 100మందికి పైగానివేశన స్థలాలు మంజూరు చేశారు. ఈ భూమి నైరుతీ బాగంలో పూర్వం నుంచి నేలబావి ఉంది. అధికారులు బావితో సహా భూమిని కొనుగోలు చేసి లబ్ధిదారునికి 1.5సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేశారు. గ్రామానికి చెందిన రాయపాటి రాధ, వేమవరపు మరియమ్మకు ప్లాట్‌ నెంబరు 15, 14 కేటయించారు. ఈ నెంబర్లలో నేలబావి ఉండటంతో దానిని పూడ్చి చదును చేసి ఇస్తామని రెవోన్యూ అధికారులు చెప్పారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు బావిని పూడ్చలేదు. తమతో పాటు స్థలాలు తీసుకున్న వారు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని తమకు మాత్రం అధికారులు న్యాయం చేయకుండా మీరే బావిని పూడ్చుకోమని చెపుతున్నారని రాధ భర్త సంసోన తెలిపారు. బావి పూడ్చాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని తమకు అంత స్థోమత లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

Updated Date - 2021-09-28T05:30:00+05:30 IST