తుంగాతీరం.. భక్తజనసంద్రం

ABN , First Publish Date - 2022-08-15T04:33:05+05:30 IST

అశేషంగా తరలి వచ్చిన భక్తులతో మంత్రాలయం తుంగా తీరం పులకరించింది.

తుంగాతీరం.. భక్తజనసంద్రం
పూలు చల్లేందుకు గగనతలంలో తిరుగుతున్న హెలికాప్టర్‌

  1. భక్తులతో పులకరించిన తుంగా తీరం 
  2. వైభవంగా రాఘవేంద్రుల మహా రథోత్సవం 
  3. హెలికాప్టర్‌తో మహారథంపై పూలవర్షం  

మంత్రాలయం, ఆగస్టు 14: అశేషంగా తరలి వచ్చిన భక్తులతో మంత్రాలయం తుంగా తీరం పులకరించింది. గుండెల నిండా భక్తి నింపుకుని దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు ‘మూలరామా విజయథే.. తుంగా తీరా నివాసా రాఘవేంద్రాయ నమో నమః’’ అంటూ ఆనందంతో పరవశించారు. రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లోని ఉత్తరాధనలో భాగంగా ఆదివారం మహా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత పాఠశాల వరకు ఊరేగించి తిరిగి శ్రీమఠానికి తీసుకువచ్చారు. మఠం అర్చకులు, మఠం సిబ్బంది భక్తులపై రంగులు చల్లుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగారు. ఉత్సవమూర్తిని రథంపైకి ప్రతిష్టిస్తుండగా.. లక్షలాది మంది భక్తులు జయహో గురు రాఘవేంద్ర.. విజయహో అంటూ పెద్ద ఎత్తున జయధ్వానాలు పలికారు. మహా రథంపై నుంచి పీఠాధిపతి అభివాదం చేస్తున్న సమయంలో భక్తుల చప్పట్లతో శ్రీమఠం మహా ముఖద్వారం ప్రతిధ్వనించింది. చండీ వాయిద్యం, నాదహారం, కోలాట నృత్యాలు, బీరప్ప డ్రోన్లు, భజన మండల భక్తి పాటలు, సహన వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, వివిధ భక్తుల వేషధారణల మధ్య మహారథం ముందుకు సాగింది. బెంగళూరు నుంచి కిరణ్‌ అనే భక్తుడు తెచ్చిన హెలికాప్టర్‌ నుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రథంపై పూలవర్షం కురిపించారు. ఈ దృశ్యాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అనంతరం శ్రీమఠానికి చేరుకున్న మహా రథం నుంచి ఉత్సవమూర్తిని బృందావనం ముందు ఉంచి పూజలు చేశారు. పీఠాధిపతి మహామంగళ హారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి మూలరాములకు పూజలు చేశారు. కార్యక్రమంలో పండిత కేసరి విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, మఠం దివాన సుజీంద్రాచార్‌, ఆనంద తీర్థాచార్‌, గౌతమాచార్‌, శ్రీమఠం సలహాదారు శ్రీనివాస్‌ కస్బే, నకతే శ్యాంప్రసాద్‌, ఏయేబో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈలు బద్రినాథ్‌, శ్రీహరి, వ్యాసరాజాచార్‌, బిందు మాధవ్‌, ద్వారపాలక అనంతస్వామి, భీమ్‌సేన రావు, జయతీర్థాచార్‌, వాఘిరాజాచార్‌లు పాల్గొన్నారు.  

కొలిచే కొద్ది వరాలిచ్చేది రాఘవేంద్రులే 

 రాఘవేంద్రస్వామిని కొలిచేకొద్ది వరాలు ప్రసాదించేది రాఘవేంద్రుల స్వామివారేనని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు దివ్యసందేశాన్ని ఇచ్చారు. ఆదివారం రాఘవేంద్రస్వామి మహారథోత్సవం పై నుంచి మాట్లాడారు. ఉద్యోగం, విద్య, అనారోగ్యం, వివాహం, సంతానం, కష్టాలు తీర్చాలని కోరుకుని మొక్కులు చెల్లించుకుంటే అనుగ్రహించేది రాఘవేంద్రుల స్వాములవారేనని అన్నారు. గత రెండేళ్లుగా కరోనాతో ఉత్సవాలను కట్టడితో చేశామని, ఈ ఏడాది కరోనా శాంతించడం వల్ల పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించామన్నారు. భారత సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాలను మించినది మరొకటి లేదని, హిందూ సంరక్షణ కోసం శ్రీమఠం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తన గురువులైన సుయథీంధ్రతీర్థుల నుంచి పది సంవత్సరాలుగా పీఠానికి వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. మధ్వ కారిడార్‌, మహా ముఖద్వారం ఎలివేషన, వంద గదులు పూర్తి చేయించి, మరో వంద గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. హిందూ ధర్మానికి మూలంగా ఉన్న మ్యూజియం ఏర్పాటు, మన సంస్కృతిని తెలిపేలా ఏర్పాటు చేశామన్నారు. పీఠాధిపతి చెప్పే ప్రతి మాటలకు భక్తులు నిశబ్బంగా వింటూ పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.  జాతి, మత, కుల భేదాలు లేకుండా రాఘవేంద్రస్వామికి కొలవవచ్చని సూచించారు. 

రథోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు

రాఘవేంద్ర స్వామి మహారథోత్సవ వేడుకల్లో బెంగళూరు ఎమ్మెల్యే అరవింద్‌ లింబావలి, ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, గౌహతి హైకోర్టు రిటైర్డు చీఫ్‌ జస్టిస్‌ శ్రీధర్‌రావు సింగిల్‌ విండో అధ్యక్షుడు ప్రదీ్‌పరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, వ్యవసాయ మండలి చైర్మన విశ్వనాథరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేష్‌, అమర్నాథ్‌ రెడ్డి, వగరూరు రామిరెడ్డి, అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు. 









Updated Date - 2022-08-15T04:33:05+05:30 IST