Tungabhadra Reservoir: ఉరకలేస్తున్న తుంగభద్ర

ABN , First Publish Date - 2022-08-11T17:07:58+05:30 IST

తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) గంటగంటకు వరద పోటు పెరుగుతుండంతో

Tungabhadra Reservoir: ఉరకలేస్తున్న తుంగభద్ర

                                     - గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం


బళ్లారి/బళ్లారి సిటీ(కర్ణాటక), ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) గంటగంటకు వరద పోటు పెరుగుతుండంతో బుధవారం 33 క్రస్ట్‌గేట్ల ఎత్తి నీటిని నదికి వదిలారు. జలాశయానికి 1,92,178 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా 1,80,969 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో తుంగభద్ర నది ప్రవహించే పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగి పోయాయి. ఇందులో ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన హంపిలోని పలు స్మారకాలు నది నీటిలో మునిగిపోయాయి. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల(Sri Krishna Devaraya) సమాధి మునిగిపోయింది. ప్రధానంగా బళ్లారి, కొప్పళ జిల్లాల వారధిగా ఉన్న కంప్లి వంతెన పూర్తిగా మునిగి పోవడంతో రెండు జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జలాశయానికి ఉన్న 33 క్రస్ట్‌గేట్లలో 28 గేట్లను 4 అడుగుల మేర, మిగిలిన ఐదు క్రస్ట్‌గేట్ల(Crustgate)ను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో రెండు లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలే పరిస్థితి రావచ్చునని వివరించారు. కంప్లి నదిలో వరద ఉధృతి పెరగడంతో నది ఒడ్డున ఉన్న కుటుంబాలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. కంప్లిలోని వెంకటరమణ దేవాలయం, గంగమ్మ గట్టు చుట్టూ భారీగా నీరు చేరింది. చారిత్రాత్మక కుమారాం కోట ద్వారం జలమయమైంది. హంపి పురంధరదాసు(Purandharadasa of Hampi) మండపం, కర్మమండపం, విజయనగర కాలం నాటి కాలినడక వంతెన, చక్రతీర్థం, రామాలక్ష్మణ దేవాలయం, పాలుమండపం, స్నానఘట్టాలు నీట మునిగాయి.  

Updated Date - 2022-08-11T17:07:58+05:30 IST