గుణభద్ర

ABN , First Publish Date - 2020-11-20T06:41:07+05:30 IST

తుంగభద్రకు నమస్కారం. పశ్చిమ కనుమల పాదసానువులలో రెండుగా పుట్టి, రెండుగా ప్రవహించి, ఒకటిగా మేళవించిన కన్నడనదికి నమస్కారం. నాటి రాయలపేరు నేటికిని తలపోయు తోయమాలికలను ధరించి హంపీశిలాకవిత్వాలను.....

గుణభద్ర

తుంగభద్రకు నమస్కారం. పశ్చిమ కనుమల పాదసానువులలో రెండుగా పుట్టి, రెండుగా ప్రవహించి, ఒకటిగా మేళవించిన కన్నడనదికి నమస్కారం. నాటి రాయలపేరు నేటికిని తలపోయు తోయమాలికలను ధరించి హంపీశిలాకవిత్వాలను స్పృశిస్తూ తెలుగుసీమలోకి అడుగుపెట్టే తియ్యటి నదికి నమస్కారం. అలంపురం కూడలసంగమేశ్వరములో అక్కమహాదేవి ప్రియదేవుని సమక్షంలో తనను తాను కృష్ణార్పణం చేసుకున్న నడిగడ్డనదికి నమస్కారం. 


తుంగభద్రను ‘గుణభద్ర’ అని సంబోధించాడు తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యంలో ప్రథమాశ్వాసంలోని తుంగభద్ర ప్రశంస తెలుగు ప్రాచీన కవిత్వంలో ఒక ఆణిముత్యం. ‘‘గంగా సంగమమిచ్చగించునె, మదిన్ గావేరి దేవేరిగా/నంగీకారమొనర్చునే? యమునతో నానందముం బొందునే/రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీ/యంగంబంటి సుఖించునేని గుణ భద్రా, తుంగభద్రానదీ!!’’. తుంగభద్ర నది కాదు. ఉపనది. ఉపనదులు నదులలో కలుస్తాయి. సముద్రంలో కలవవు. సముద్రుడిని మగవాడిగా, నదులను స్త్రీలుగా చెప్పడం కావ్యాల్లో , పురాణాల్లో ఆనవాయితీ. సముద్రుడికి తుంగభద్ర తెలియదు, ఎంత అందంగా ఉంటుందో తెలియదు. తెలిసి ఉంటే గంగను, కావేరిని ఇష్టపడేవాడా? - అంటున్నాడు రామకృష్ణుడు. అంత గొప్ప ఊహ చేసీ, కవి పప్పులో కాలేశాడు. యమునతో సముద్రుడు ఆనందం పొందేవాడా- అన్నాడు పై పద్యంలో. యమున కూడా ఉపనదే. వేల ఏళ్ల నుంచి ప్రయాగ పుణ్యక్షేత్రం కదా, అక్కడే కదా గంగా యమున కలగలిసేది, అయినా కవికి సమాచార లోపం ఉన్నట్టుంది. అయితేనేం, తుంగభద్ర గురించి అతిగొప్ప ప్రశంసాకవనాన్ని అందించాడు. 


మహానదులకు దక్కినన్ని కీర్తనలు, కావ్యాలు ఉపనదులకు దొరకవేమో అనిపిస్తుంది. కానీ, పుష్కరాలు జరిగే పన్నెండు భారతీయ నదులలో తుంగభద్ర కూడా ఉన్నది. తుంగభద్ర రెండు కవలనదుల సంగమం అంటారు. నిజమే. కానీ, ఆ రెండే కాదు, చాలా చిన్న చిన్న వాగులూ వంకలూ ఉపనదులూ దాని మార్గంలో వచ్చి చేరాయి. హోస్పేట తుంగభద్ర డ్యామ్ తరువాత కూడా రెండు నదులు (వేదవతి, హంద్రీ) తుంగభద్రలో కలుస్తాయి. చిన్న నదులే అయినప్పటికీ మహారాజ్యాల్ని తమ తీరంలో నిలుపుకున్న వాటిలో తుంగభద్ర కూడా ఒకటి. రెండువందలేళ్లకు పైగా వైభవానికి, సుస్థిరతకు, సాంస్కృతిక విలాసానికి పేరుపొందిన విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర ఒడ్డునే వెలిగింది. కృష్ణ ఒడ్డున రక్కసి తంగడి గ్రామంలో జరిగిన యుద్ధంలో రాజ్యం పతనమైంది, విజయనగరం నేలమట్టమయింది. ‘‘శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు’’. బహుభాషా రాజ్యం, తెలుగు లెస్సగా వర్థిల్లిన రాజ్యం.


గొప్ప గొప్ప నదులు దోసెడు నీళ్లివ్వగలగడానికి యాంత్రిక యుగమూ ఆధునిక దేవాలయాలూ కావలసివచ్చింది కానీ, చిన్న నదులతో ఎన్ని అద్భుతాలు చేయవచ్చునో తుంగభద్ర నిరూపించింది. హంపి నుంచి కర్నూలు దాకా వరదలు ఒడ్లను కోసేయకుండా రాయలు కట్టించిన రాతి గోడలు ఇప్పటికీ చూడవచ్చు. కడప నీటి కోసం ఇంగ్లీషువాడు తవ్వించిన కాలువను, కట్టిన బ్యారేజిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాము. నిజాం పాలించిన హైదరాబాద్ రాజ్యానికి, బ్రిటిష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీకి మధ్య సంయుక్త నిర్మాణంగా తుంగభద్ర ఆనకట్టను తలపెట్టారు. స్వాతంత్య్రానంతరం, హైదరాబాద్ విలీనం తరువాత ప్రాజెక్టు పూర్తయింది. తుంగభద్ర మీదనే నిర్మించిన రాజోలి బండ రిజర్వాయర్ మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులకు దోహదకారిగా తలపెట్టింది. అనేక వివాదాలకు కూడా వేదికగా ఉన్నది. పశ్చిమ కనుమలలో పుట్టి దక్షిణ ఆగ్నేయానికి ప్రవహించే కృష్ణానదితో అలంపురం వద్ద తుంగభద్ర సంగమిస్తుంది. ప్రతి నదీసంగమంలోనూ వెలిసే మహాశివుని తొలి సంగమేశ్వరాలయం శ్రీశైలం జలాశయంలో మునిగిపోగా, పునర్నిర్మాణం చేశారు. కృష్ణకూ తుంగభద్రకూ నడుమ ఏర్పడిన త్రిభుజాకార ప్రాంతాన్ని దోఆబ్ (రెండు నదులు), నడిగడ్డ సీమ అంటారు. సారవంతమైన నేల, సుభిక్ష ప్రాంతం, ప్రాచీన దేవాలయాలకు ఆలవాలం. 


నది ఏకకాలంలో స్థావరం, జంగమం కూడా. ఏ నదిలోనూ ఎవరూ రెండుసార్లు స్నానం చేయలేరు అంటారు. నీరు పారిపోతుంది. నది మిగిలిపోతుంది. నది జలహృదయానికి చెవిపెట్టి వింటే ఎన్నెన్నో చరిత్రలను ఆలకించవచ్చు. నదుల తీరంలోనే నాగరికతలు వికసించాయంటారు. పరీవాహక ప్రాంతాలు విస్తరించినంతమేరా జనావాసాలు ఏర్పడ్డాయేమో. వేర్వేరు జీవావరణ వ్యవస్థలకు వలసవెళ్లిన వారంతా అప్పుడప్పుడు కలుసుకోవడానికి చేసుకున్న ఏర్పాటు కాబోలు పుష్కరాలు. వేదాల్లోనూ, తొలి వరుస పురాణాల్లోనూ ఎక్కడా పుష్కరాల ప్రస్తావన కనిపించదు. జ్యోతిష్యం బాగా స్థిరపడిన తరువాత, మధ్యయుగాలలో ఇది మొదలై ఉండవచ్చును అంటారు. పుష్కరం ఒక సామాజిక సామూహిక సందర్భంగా మారిపోయింది. వాణిజ్యీకరణ, వేలంవెర్రి అన్నిటా పెరిగిపోతున్న నేటి కాలంలో, విపరీతమైన సంఖ్యలో పుష్కరాలకు జనం హాజరుకావడం నిర్వాహకులకు అనేక సమస్యలను సృష్టిస్తున్నది. నిజానికి పుష్కరం సంవత్సర కాలం ఉంటుంది. అందులో మొదట పదిహేనురోజులు, చివరి పదిహేను రోజులు ముఖ్యమైనవని అంటారు. సమ్మర్దం, అపరిశుభ్రత, అనారోగ్యాలు, వసతుల లేమి- వంటి సమస్యలు ఎదురుకాకుండా అందరూ పుష్కర నదులను సందర్శించవచ్చు. 


బృహస్పతి మకరరాశిలో ప్రవేశించినప్పుడు, ప్రతి పన్నెండేళ్లకొకసారి, తుంగభద్ర పుష్కరనది అవుతుంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలలో తుంగభద్రను దర్శించుకోనున్న కన్నడ, తెలంగాణ, రాయలసీమ ప్రజలందరికీ శుభాకాంక్షలు! విపత్తుల కాలంలో ధార్మి్క, లౌకిక సందర్భాలన్నిటిలో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Updated Date - 2020-11-20T06:41:07+05:30 IST