ఉత్తుంగ తీరం.. ఆధ్యాత్మికం

ABN , First Publish Date - 2020-11-20T05:39:03+05:30 IST

తుంగభద్ర నదీ పుష్కరాలు శుక్రవారం ఆరంభమవుతున్నాయి. లక్షలాది భక్తజనం కోసం జిల్లాలో 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో వీఐపీ పుష్కర ఘాట్‌తో పాటు 7 ఘాట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు నదిలో..

ఉత్తుంగ తీరం.. ఆధ్యాత్మికం
నగరంలో విద్యుత్‌ వెలుగులతో పుష్కర ఘాట్‌

నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు 

జిల్లాలో 23 పుష్కర ఘాట్లు

నదీ స్నానాలపై ఆంక్షలు.. ఘాట్ల వద్ద షవర్లు 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాక


కర్నూలు(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదీ పుష్కరాలు శుక్రవారం ఆరంభమవుతున్నాయి. లక్షలాది భక్తజనం కోసం జిల్లాలో 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో వీఐపీ పుష్కర ఘాట్‌తో పాటు 7 ఘాట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు నదిలో అధికారులు స్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేసి పూజలు, పిండ ప్రదానాలు చేసుకోడానికి ఏర్పాటు చేశారు. పుష్కరాల్లో నదీ స్నానం లేకుండా పిండ ప్రదానాలు ఎలా చేస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. కాగా అధికారులు మాత్రం ఘాట్ల వద్ద షవర్‌బాత్‌లు, వైద్య శిబిరాలు, ఈ టాయిలెట్స్‌ సిద్ధం చేశామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌ వీఐపీ ఘాట్‌లో తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. 


సంప్రదాయం ప్రకారం పుష్కరాలు

పంచభూతాల్లో నీరు సకల జీవకోటికి ఆధారం. నదులను దేవతా స్వరూపాలుగా భావించడం ఆచారం. పన్నెండు రాశుల్లో గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకొని పుష్కరాలను నిర్ణయిస్తుంటారు. గ్రహాల్లో దేవతల గురువుగా పేర్కొనే బృహస్పతి గమనానికి పట్టే సమయం పన్నెండేళ్లు. అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మొత్తం పన్నెండు సంవత్సరాల్లో రాశిచక్రాన్ని చుట్టి వస్తాడు. అలా బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి అడుగిడిన రాశికి సన్నిహిత ప్రాంతంలోని జీవనదికి ఆ ఏడాది పుష్కరాలు ఉంటాయి. గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీత అనే పన్నెండు నదులు పుష్కర ప్రవేశగల పుణ్యతీర్థాలుగా ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి మకర రాశిలో ప్రవేశిస్తున్న కారణంగా తుంగభద్ర నదికి శుక్రవారం నుంచి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఈ ఏడాదిలో మొదటి పన్నెండు రోజులు ‘ఆది పుష్కరాలు’ అని, చివరి పన్నెండు రోజులు ‘అంత్య పుష్కరాలు’ అని వ్యవహరిస్తారు.


పుష్కరాల్లో ఆచరించాల్సినవి..

పుష్కర రోజుల్లో సకల దేవతలు, మహర్షులు, పితృదేవతలు నదిలో కొలువుదీరి ఉంటారని, అందువల్ల పుష్కర దినాలు ఆ నదికి పుణ్య దినాలని పేర్కొంటారు. పుష్కర రోజుల్లో నదిలో స్నానం ఆచరించడం, పూజించడం, వ్రతమాచరించడం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం, దానాలు చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. 

నదికి నమస్కారం: పుష్కర స్నానానికి వెళ్లినవారు తుంగభద్ర తీరం చేరుకోగానే నదిని దర్శించి ‘సహ్యపాద సముద్భూతా.. పవిత్ర జలపూరితా... తుంగభద్రేతి విఖ్యాతా.. పాపం వ్యపోహతు’ శ్లోకాన్ని చెప్పి నమస్కరించాలి.

నదీ స్నానం: పుష్కరాల్లో నదీ స్నానం ప్రధానమైంది. సంప్రదాయబద్ధంగా, నియమానుసారంగా విధి విధానంగా చేయాలి. నదీమాతను స్తుతిస్తూ మూడు మునకలు వేయాలి.

దేవతలకు అర్ఘ్యం: స్నానానంతరం తూర్పు దిక్కు తిరిగి దేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రత్యక్షదైవం సూర్యునికి, అనంతరం తుంగభద్ర నదికి, పుష్కరునికి, బృహస్పతికి, ఇష్టదేవతలకు, మహర్షులకు అర్ఘ్యం ఇచ్చి, చివరగా పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి.

నదీమతల్లికి పూజలు: స్నానానంతరం నదీ తీరానికి చేరుకొని నదీమతల్లికి పూజలు చేయాలి. విస్తరాకులు మూడింటిని వరుసగా ఉంచి, వాటిపై బియ్యం పోసి మూడు కలశాలను ప్రతిష్టించాలి.  తుంగభద్ర నదిని, బృహస్పతిని, పుష్కరుడిని ఆవాహనం చేసి పూజలు చేయాలి. 

శ్రాద్ధ కర్మలు: తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు, తర్పణాలు విడిచి పిండప్రదానాలు చేసి తర్వాత పితామహుడు, మాతామహుడు, పెదతండ్రి, పినతండ్రి తదితర బంధువులకు, గురువులకు, ప్రభువులు, తర్పణం విడిచి పిండ ప్రదానం చేయాలి. 


పన్నెండు రోజులు.. దేవతా పూజలు

పుష్కరాల పన్నెండు రోజుల్లో పూజలు, దానాలు నిర్వహించాలని శాస్త్ర వచనం. అలాగే ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజించడంతోపాటు కొన్ని దానాలు చేయాలి. 

మొదటి రోజు - శ్రీమహా విష్ణువు పూజ, గురు జప మంత్రం పఠనం, హిరణ్య శ్రాద్ధం, బంగారు, వెండి, భూమి, ధాన్యం దానం చేయాలి. 

రెండో రోజు - సూర్యభగవానుడి పూజ, చటక శ్రాద్ధాన్ని ఆచరించాలి. గోవు, వస్త్రం, రత్నాలు, ఉప్పు దానం చేయాలి.

మూడో రోజు - లక్ష్మీదేవి పూజ, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. నగదు, కూరగాయలు, పండ్లు, బెల్లం, గుర్రాన్ని దానం చేయాలి.

నాలుగో రోజు - వినాయకుని పూజ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర పఠనం, నెయ్యి, నూనె, పాలు, తేనె, పానకం దానం చేయాలి.

ఐదో రోజు - శ్రీకృష్ణుని పూజ, ఓం సూర్యాయనమః అని, ఓం శ్రీసూర్యనారా యణాయ నమః అనే మంత్రాన్ని రోజంతా పఠించాలి. ధాన్యం, దున్నపోతు, ఎద్దు, గేదె, బండి, నాగలి వంటివి దానం చేయాలి.

ఆరో రోజు - సరస్వతిమాత పూజ, శ్రీలక్ష్మి మంత్ర పఠనం, ఔషధాలు, గంధం, కస్తూరి, కర్పూరం దానం చేయాలి.

ఏడో రోజు - గౌరి పూజ, గణేశ్‌ మంత్రం పఠనం, అన్నదానం, మంచం, పల్లకి, ఊయల, ఆసనం, ఇల్లు దానం చేయాలి

ఎనిమిదో రోజు - శివుని పూజ, శ్రీకృష్ణమంత్ర జపం, బ్రాహ్మణునికి అంగవస్త్రాన్ని దానం చేయాలి. పూలదండ, గంధపుచెక్క, అల్లం, కందమూలాలలు దానం చేయాలి.

తొమ్మిదో రోజు- అనంతుని పూజ, సరస్వతి దేవి మంత్రపఠనం, పితృదేవతలకు పిండప్రదానాలకు విశేష దినం, దుప్పట్లు, కన్య, సేవకులు, కంబళి దానం చేయాలి.

పదో రోజున - నరసింహ స్వామి పూజ, పార్వతీ మంత్రం, రాగిచెంబు, గ్లాసు, తుండుగుడ్డ, సాలగ్రామం, పుస్తకం దానం చేయాలి.

పదకొండో రోజున - వామన పూజ, శివ పంచాక్షరీ మంత్రం పఠించాలి. అన్న దానం చేయాలి. గంధం , యజ్ఞోపవీతం, వస్త్రం, తాంబూలం దానం చేయాలి.

పన్నెండో రోజున - శ్రీరాముడి పూజ, రామనామ జపం, నువ్వుల దానం చేయాలి. చివరి రోజున షోడశ దానాలు లేదా దశ దానాలు చేస్తే మంచిది. 


నగరంలో పుష్కర ఘాట్లు, పార్కింగ్‌ ఇలా..

కర్నూలు నగరంలో ఏడు పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేశారు. అవి 1) సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌, 2) మాసా మసీదు (పంప్‌హౌస్‌) వద్ద, 3) నాగసాయి ఆలయం పుష్కర ఘాట్‌ (కొత్తపేట), 4) రాంభొట్ల ఆలయం పుష్కర ఘాట్‌ (ఓల్డ్‌టౌన్‌), 5) సాయిబాబా ఆలయం పుష్కర ఘాట్‌, నగరేశ్వర స్వామి పుష్కర ఘాట్‌ ఉన్నాయి. 


వాహనాల పార్కింగ్‌..

- పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు సంజీవని హాస్పిటల్‌ పక్కన, వసంత రెసిడెన్సీ పక్కన పొలాల్లో పార్కింగ్‌

- వీఐపీల వాహనాలకు ఘాట్‌కు కుడి పక్కన వాహనాల పార్కింగ్‌లో నిలపాలి. 

- మునగాలపాడు పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు తిప్పమ్మ కొట్టం వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. 

- నాగసాయి పుష్కర ఘాట్‌ కు వెళ్లే వారు ఓల్డ్‌ సాయిబాబా టాకీసు వద్ద వాహనాలు పార్కింగ్‌ చేయాలి.

- సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌కు వెళ్లేవారు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో పార్కింగ్‌ చేయాలి.

- నగరేశ్వర పుష్కర ఘాట్‌, రాఘవేంద్ర మఠం ఘాట్‌, రాంభొట్ల పుష్కర ఘాట్‌లకు వెళ్లేవారు మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పార్క్‌ చేయాలి.

- రాంభొట్ల పుష్కర ఘాట్‌కు వచ్చే టూ వీలర్స్‌లు జమ్మిచెట్టు వద్ద పార్కింగ్‌ చేయాలి. 


పుష్కరాలకు నీరు విడుదల

కర్నూలు: తుంగభద్ర పుష్కరాలకు నీరు విడుదలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీర పాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తదితరులు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 2,600 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో పాటు మరో 4వేల క్యూసెక్కులు మొత్తం 6,600 క్యూసెక్కులు నదిలోకి వదలాలని నిర్ణయం తీసుకున్నారు. 


స్నానాలకు అనుమతి లేకపోవడం బాధాకరం

పుష్కరాల్లో నదిలో స్నానాలు ఆచరించడం ముఖ్యం. తర్వాత పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలాలి. కానీ తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానాలు నిషేధించారు. రూ. 250 కోట్ల మేరకు ఖర్చు చేసి పుష్కరాలు నిర్వహించడం షవర్‌ బాత్‌ చేయడానికా..? దీనికంటే ఇంట్లోనే పంపుస్నానాలు చేయవచ్చు కదా?

- దేవెళ్ల సాయినాథ్‌ శర్మ, పురోహితుడు, కర్నూలు


ఇంకా సాగుతూనే..

తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రాత్రి వరకూ రోడ్లు వేస్తూ కనిపించారు. కొన్ని ఘాట్ల వద్ద అపరిశుభ్రంగా ఉంది. మునగాలపాడు, పంచలింగాల ఘాట్లకు వెళ్లే రోడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. కంకర రాళ్లను పేర్చి వదిలేశారు. డిప్యూటీ స్పీకర్‌ కోనా రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంకరపై తారు రోడ్డు పనులు సాయంత్రం ప్రారంభించారు. మునగాలపాడు ఘాట్‌ వద్ద కంకర రహదారిపైనే పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతూ కనిపించారు. మంత్రాలయంలో అయితే ఘాట్ల పనులు పూర్తి కాలేదు. అప్రోచ్‌ రోడ్డు పనులు అధ్వానంగా ఉన్నాయి. మధ్యలోనే వదిలేశారు. పూర్తిస్థాయిలో పనులు జరక్కపోగా తాత్కాలిక మరుగు దొడ్లను ఏర్పాటు చేసినా పైపు కనెక్షన్‌ ఇవ్వడం మరిచారు.   

  - మంత్రాలయం



Updated Date - 2020-11-20T05:39:03+05:30 IST