తుంగభద్ర వైభవం

ABN , First Publish Date - 2020-11-19T05:44:36+05:30 IST

మానవ జీవన ప్రగతిలో నదులు కీలకం. నదీ తీరాల..

తుంగభద్ర వైభవం

పడమటి కనుమల్లో ఉద్భవం

సీమ సాగు, తాగునీటికి మూలాధారం

అడుగడుగునా ప్రాజెక్టులు.. పరిశ్రమలు

ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న పుణ్య నది

రేపటి నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): మానవ జీవన ప్రగతిలో నదులు కీలకం. నదీ తీరాల వెంటే అనేక నాగరికతలు పరిఢవిల్లాయి. ప్రాచీన నాగరికత సంస్కృతులను తనలో నిక్షిప్తం చేసుకున్న నదుల్లో తుంగభద్ర ఒకటి. జిల్లాలో ఏటా 3 లక్షల ఎకరాల పొలాలకు సాగునీరు అందిస్తోంది. లక్షల మందికి తాగునీరు ఇస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి ఏటా 30 టీఎంసీలు, వర్షాధారంగా మరో వంద టీఎంసీల నీరు జిల్లాలో ప్రవహిస్తోంది. సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మలో కలుస్తోంది. రాయలసీమ నేలపై పచ్చదనం పరుస్తున్న తుంగభద్రకు పన్నెండేళ్లకు ఒకసారి ‘పుష్కర’ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 20 నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. జిల్లాలో మంత్రాలయ క్షేత్రం నుంచి సంగమేశ్వర క్షేత్రం వరకు 23 ప్రాంతాల్లో నదీ స్నానాలకు ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.250కోట్లు ఖర్చు చేస్తోంది.


పురాణ గాథ

పురాణాల ప్రకారం వరాహ అవతారంలో శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుడనే రాక్షసుడ్ని సంహరించాక కలియుగంలో వరాహస్వామికి ఉన్న రెండు కోరల్లో (దంతాలు) తుంగ అనే ఎడమ కోర, భద్ర అనే కుడి కోర భూమిపై వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ కోరలు పడిన ప్రదేశం నుంచి జలం ఉబికి నదులుగా మారింది. ఈ రెండు నదుల సంగమమే తుంగభద్ర. వరాహస్వామి నుంచి ఆవిర్భవించిన దే (వరాహ పర్వత శ్రేణుల్లో జన్మించింది) తుంగభద్ర. మహావిష్ణువు కోరల నుంచి స్రవించిన మధుర ద్రవం ఆయన పాదం నుంచి ఉద్భవించిన గంగకు మూలం అయింది. అంటే తుంగ జన్మస్థానం ‘గంగమూల’ ప్రదేశం అయింది. అందుకే ‘తుంగా పానం - గంగా స్నానం’ అని శ్లోకం ఉంది. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని, తుంగభద్ర జలం తాగితే అమృతత్వ స్థితి కలుగుతుందని పురాణాల్లో ఉంది. ‘జయ జననీ గంగానదీ తుల్య తుంగోత్తరంగావళీ శోభి తుంగా ధునీతీర సంరాజి శృంగాద్రి వాసైకలోలే’ అని శోక్లం ఉంది. అంటే పుష్కర కాలంలో మహిమతో ఉన్న తుంగభద్ర జలంతో స్నానం, దానం, శ్రాద్ధం, తర్పణాలు చేస్తే.. అక్షయ ఫలం లభిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటారు.

  

జల సంపద

తుంగభద్ర నదిపై అనేక జలాశయాలు ఉన్నాయి. కర్ణాటకలోని శిమొగ్గ నగరానికి 15 కి.మీ. దూరంలో గజనూర్‌వద్ద తుంగా నదిపై ప్రాజెక్టు నిర్మించారు. భద్రావతికి ఎగువ భాగంలో లక్కపల్లి వద్ద భద్రనదిపై భద్రా డ్యామ్‌, బళ్లారి జిల్లాలోని హోస్పేట్‌ సమీపంలో తుంగభద్ర డ్యామ్‌ నిర్మించారు. ఇవి ఆ రాష్ట్రంలో బహుళార్థసాధక ప్రాజెక్టులు. చిక్‌మంగళూరు, శిమొగ్గ, దావణగేరె, హవేరి, బళ్లారి, కొప్పల్‌, రాయచూర్‌ జిల్లాల్లో అనేక పరిశ్రమలను ఈ నదీ తీరాన నెలకొల్పారు. జిల్లాలో సుంకేసుల జలాశయంతోపాటూ కేసీ కెనాల్‌ ద్వారా కడప వరకు సాగునీటిని తుంగభద్రమ్మ అందిస్తోంది. 


పుష్కరం అంటే..

పుణ్యస్య పోషాద్గజ్గా పుష్కరేత్య భిధీయతే’ అని సంస్కృతంలో శ్లోకం ఉంది. అంటే పుష్కరం అంటే పోషించడం, వృద్ధి చేయడం అని అర్థం. గంగ (జలం) పుణ్యాన్ని  వృద్ధి చేస్తుంది అని అర్థం. పోషయతి పుష్ణాతీతి పుష్కరం’ అని మరొక నిర్వచనం ఉంది. అంటే పుష్టి నిచ్చి పోషించేది పుష్కరం అని సారాంశం. 


ఆవిర్భావం.. ప్రవాహం..

కర్ణాటకలోని పడమటి కనుమల్లో.. సహ్యాద్రి పర్వతం మీద వరాహ శిఖరం వద్ద ‘గంగమూల’ అనే ప్రదేశం వద్ద ‘తుంగ’ ఆవిర్భవించింది. అక్కడి నుంచి చిక్‌మంగళూరు, శృంగేరి క్షేత్రం, శిమొగ్గ జిల్లాల మీదుగా 147 కి.మీ. ప్రయాణించి శిమొగ సమీపంలో ‘కూడలి’ అనే చిన్న పట్టణం వద్ద ‘భద్ర’ నదితో కలిసి ‘తుంగభద్ర’గా మారుతుంది. అక్కడి నుంచి మస్కినల, హైరెల్లా, అల్వందనల, సింధనూర్‌ నల, ఇంఛనల్‌నల, కనకగిరినల, నందిహల్‌నల, కాప్‌గల్‌నల వంటి వాగులను కలుపుకుంటూ కొప్పల్‌, గంగావతి, సింధనూర్‌, మాన్వీ, రాయచూర్‌ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ బళ్లారి జిల్లాలోని హగరి నదిని ఐక్యం చేసుకుంటుంది. అక్కడి నుంచి 250 కి.మీ. ప్రవహించి, కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి వద్ద రాష్ట్రంలో అడుగుపెడుతోంది. అక్కడి నుంచి రామాపురం, మంత్రాలయం, నాగులదిన్నె, గురజాల, సంగాల, గుండ్రేవుల, ఈర్లదిన్నె, కె. సింగవరం, కొత్తకోట మీదుగా సాగుతూ సుంకేసుల జలాశయానికి చేరుతుంది. తరువాత ఆర్‌.కొంతలపాడు, జి.సింగవరం, మామిదాలపాడు, కర్నూలు నగరం మీదుగా 85 కి.మీ. ప్రవహించి, సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. 


పుష్కర నేపథ్యం

పురాణాల ప్రకారం తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుడి కోసం కఠోర తపస్సు చేసి ఆయన్ను మెప్పిస్తాడు. శివుడు మెచ్చి వరం కోరుకోమనగా తుందిలుడు తనను శివునిలో ఐక్యం చేసుకోమని కోరాడు. మహేశ్వరుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలరూపంలో విలీనం చేసుకుంటూ తుందిలుడికి పుష్కరుడు అని నామకరణం చేశాడు. సార్థత్రి కోటి (3.5 కోట్ల) తీర్థములుకు రాజును చేశాడు. కాగా బ్రహ్మ సృష్టి చేసే ఉమందు ఈశ్వరుడ్ని ప్రార్థిస్తాడు. కోరికలు తీర్చే పుష్కరుడ్ని సృష్టికార్యం కోసం వరంగా పొందుతాడు. పరమేశ్వరుడు భూత తత్వాన్ని కమండలంగా చేసి అందులో పుష్కరుడ్ని ఉంచి, బ్రహ్మకు దత్తం చేశాడు. పరమేశ్వర (జల) రూపమైన పుష్కరునితో ప్రజాపతి సృష్టిని ప్రారంభించాడు. మరికొంత కాలానికి బృహస్పతి బ్రహ్మను మెప్పించి పుష్కరుడ్ని పొందాడు. తనను వదలి వెళ్లుటకు ఇష్టపడని పుష్కరునికి పుష్కర సమయంలో తాను కూడా కలిసి ఉంటానని మాట ఇవ్వడంతో పుష్కరుడు బృహస్పతి వెంట వెళ్లాడు. అలా బృహస్పతి ఏటా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరం ఏర్పడుతుంది. బృహస్పతి మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. అలా పన్నెండేళ్లు ఒకసారి పన్నెండు నదులకు పుష్కరాలు జరుగుతున్నాయి. 


పవిత్ర నది

‘తుంగ భద్రాచ మహాతీర్థం - నరక ద్వార నాశనమ్‌

బ్రహ్మవిష్ణ్యాదిభిర్నిత్సం సేవిత శంకరేణచ

తత్ర స్నాత్వా యధాశక్తి ధనం దత్వాదరేణచ

బ్రహ్మలోక మవాప్రోతి - నాత్ర కార్యవిచారణా’ 

..అంటే తుంగభద్ర తీర్థాన్ని సేవించిన వారికి, బ్రహ్మ విష్ణు శంకరాది దేవతలను సేవించిన ఫలం దక్కుతుంది. తుంగభద్ర నదిలో స్నాన, దానాలు చేసేవారు బ్రహ్మలోకం పొందుతారు.. అని పురాణాల్లో ఉంది. 


Updated Date - 2020-11-19T05:44:36+05:30 IST