దర్జాగా ఇసుక దందా

ABN , First Publish Date - 2021-10-28T06:03:50+05:30 IST

అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

దర్జాగా ఇసుక దందా
రాజధాని శంకుస్థాపన ప్రదేశం దగ్గర్లో ఇసుక అక్రమ నిల్వలు

రాజఽధాని శంకుస్థాపన ప్రదేశానికి కూతవేటు దూరంలో డంపింగ్‌

రాత్రికి రాత్రే పదులు సంఖ్యలో లారీలకు లోడు 

శంకుస్థాపనకు ప్రాంతానికి వెళ్లే రోడ్లు ధ్వంసం

కన్నెత్తి చూడని అధికారులు


తుళ్ళూరు, అక్టోబరు 27: అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అమరావతి రాజధాని కోసం ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లే దారిలో ఎక్కడపడితే అక్కడ ఇసుక డంపింగ్‌ చేస్తున్నారు. లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్య ఉన్న ఇసుక ర్యాంపు నుంచి ట్రాక్టర్లతో ఇక్కడకు తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 30 నుంచి 40 లారీల వరకు ఇసుక అక్రమంగా తరలుతోంది. ఇక్కడి నుంచి విజయవాడ, గుంటూరు నగరాలకు తరలిస్తూ రోజుకు రూ.10 లక్షల వరకు అక్రమార్కులు సంపాదిస్తున్నారు. ఇసుక ర్యాంప్‌ను అనుమతి ఉంటే ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరేది. కానీ ఏ కారణం చేతనో తుళ్లూరు మండలానికి రెండేళ్ల నుంచి ఇసుక రేవులను కేటాయించలేదు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఈ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని సమాచారం. దీంతో పోలీసులు కూడా తమకెందుకన్నట్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

 

 శంకుస్థాపన ప్రదేశానికి తాళం

రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఇసుక నిల్వలు ఉంచుతూ లారీలకు లోడు చేస్తుండడంతో శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ ప్రదేశానికి చూసేందుకు వచ్చే పర్యాటకులు కూడా ఇప్పుడు రావడం లేదు. శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో 16 వేల గ్రామాల నుంచి వచ్చిన పవిత్రమైన మట్టి, నీరు ఉంచారు. ఇక్కడ యాగశాల, రాజధాని మ్యాప్‌ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రదేశం లోపలికి వెళ్లకుండా తాళం కూడా వేశారు. మొన్నటివరకు సంరక్షణ కోసం పోలీసులు సెక్యూరిటీగా ఉండేవారు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతున్నారని స్థానికులు అంటున్నారు. తూతూ మంత్రంగా ఒక వాచ్‌మెన్‌ని గార్డెన్‌ పనులు చూడటానికి నియమించారు. అక్రమ ఇసుక దందాకు ఆటకం అని భావించే, పోలీసు సెక్యూరిటీని ఈ శంకుస్థాపన ప్రదేశంలో లేకుండా చేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ ప్రాంతంలో ఇసుక దందాని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-28T06:03:50+05:30 IST