బారెడు పెంపు - బెత్తెడు తగ్గింపు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-06T01:36:21+05:30 IST

పెట్రోలు, డీజల్‌ ధరలు భారీగా పెంచడం, తర్వాత కొంచెం తగ్గించడం చూస్తే బారెడు పెంపు - బెత్తెడు తగ్గింపు అనే విధంగా ఉందని

బారెడు పెంపు - బెత్తెడు తగ్గింపు: తులసిరెడ్డి

వేంపల్లె: పెట్రోలు, డీజల్‌ ధరలు భారీగా పెంచడం, తర్వాత కొంచెం తగ్గించడం చూస్తే బారెడు పెంపు - బెత్తెడు తగ్గింపు అనే విధంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచడంతో పెట్రోలు, డీజల్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. లీటరు పెట్రోల్‌పై రూ.33, లీటర్‌ డీజల్‌పై రూ.31.83గా సుంకం విధిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజల్‌పై రూ.10 తగ్గించి ఘనకార్యం చేసినట్లుగా దీపావళి కానుకగా ఇచ్చినట్టుగా బీజేపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. అలాగే అస్సాం, త్రిపుర, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌, బీహార్‌ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజల్‌పై కొంతమేరకు వ్యాట్‌ తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయని పేర్కొన్నారు. కానీ మన రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఆలోచన చేయకపోవడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు.

Updated Date - 2021-11-06T01:36:21+05:30 IST