అమరావతి: ప్రహసనంగా తయారైన ఇంటివద్దకే రేషన్ బియ్యం పథకాన్ని ఒక పిచ్చి తుగ్లక్ పథకంగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి అభివర్ణించారు. ఇది డోర్ డెలివరీ పథకం కాదని.. రోడ్డు డెలివరీ పథకం అన్నారు. ప్రభుత్వంపై అదనపు భారం రూ.830 కోట్లు అని.. దీనివల్ల ఎవరూ సంతోషంగా, సంతృప్తికరంగా లేరన్నారు. డీలర్లు ఎప్పుడు తమ డీలర్ షిప్లు రద్దు అవుతాయోనన్న అభద్రతాభావంతో జీవిస్తున్నారని తులసిరెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కు పోయామని.. మీ వాహనాలు వద్దు.. మీరిచ్చే డబ్బులు వద్దు మమ్మల్ని వదిలేయండి మహాప్రభో’’ అని వాహనదారులు మొరపెట్టు కుంటున్నారన్నారు. కూలి పని బదులు రోడ్లమీద పడిగాపులు పడే దుస్థితి వచ్చిందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం పునరాలోచించి పాత రేషన్ పద్ధతినే పునరుద్ధరించాలని తులసిరెడ్డి కోరారు.