మోదీ నోట మళ్లీ ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ మాట

ABN , First Publish Date - 2022-02-08T01:03:30+05:30 IST

కొంత కాలంగా బీజేపీ ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది. దేశ భద్రత అంశం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలను టుక్డే టుక్డే గ్యాంగ్ అని బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన రైతుల ఆందోళనపై కూడా..

మోదీ నోట మళ్లీ ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ మాట

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోది మరోసారి ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ అనే మాటను ప్రయోగించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే పాలసీని అవలంబిస్తుందని, ఆ పార్టీ టుక్డే టుక్డే గ్యాంగ్‌కు నాయకత్వంగా ఎదిగిందని మోదీ అన్నారు.


కొంత కాలంగా బీజేపీ ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది. దేశ భద్రత అంశం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలను టుక్డే టుక్డే గ్యాంగ్ అని బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన రైతుల ఆందోళనపై కూడా ఈ పదాన్ని ఉపయోగించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఇక జేఎన్‌యూ సహా వివిధ యూనివర్సిటీ విద్యార్థులను కూడా కొందరు బీజేపీ నేతలు టుక్డే టుక్డే గ్యాంగ్ అని సంబోధించడం తీవ్ర వివాదాలకు దారి తీసింది. తాజాగా పార్లమెంట్‌లోనే మోదీ మరోసారి ఈ పదాన్ని ఉపయోగించడం గమనార్హం.


‘‘తమిళనాడు ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గాయపర్చింది. వాళ్లు ఈ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తారు. కానీ నేను తమిళనాడు ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయినప్పుడు వాళ్లు చూపించిన ఐక్యత దేశ ఐక్యతకు మార్గ సూచికంగా కనిపించింది. రావత్ కోసం వారు వీధుల్లో క్యూలు కట్టడం దేశ పట్ల వారికున్న నిబద్ధను చూపిస్తుంది. కానీ కాంగ్రెస్ దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తోంది. విభజించి పాలించడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది’’ అని మోదీ అన్నారు.


లోక్‌సభలో రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని మోదీ ఊటంకిస్తూ సెటైర్లు వేశారు. ‘‘కొందరు మాట్లాడి వెళ్లిపోతారు. వారి కోసం ఇంకొందరు ఇక్కడ ఉండాల్సి వస్తుంది’’ అని లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరివైపు చూస్తూ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే ప్రస్తుత ద్రవ్యోల్బణం ఎక్కువేనని మోదీ అన్నారు.

Updated Date - 2022-02-08T01:03:30+05:30 IST