తుఫానుతో అస్తవ్యస్థం

ABN , First Publish Date - 2020-11-28T05:37:05+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా శుక్రవారం జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి.

తుఫానుతో అస్తవ్యస్థం
తాటిపర్తి పొలాల్లో చిక్కుకున్న బాధితులను బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ..

 చిమ్మచీకట్లో పలు గ్రామాలు

 రహదారి పొడవునా నిలిచిన ట్రాఫిక్‌

వెంకటాచలం, నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌ కారణంగా శుక్రవారం జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. వర్షాలతో  కొన్ని గ్రామాల్లోని పొలాలు నీటమునిగాయి. ఈదగాలి, గుడ్లూరువారిపాళెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, ఈదగాలి, పూడిపర్తి, ఎగువమిట్ట, తాటిపర్తిపాళెం, తిరుమలమ్మపాళెం, గూడ్లూరువారిపాళెం గ్రామాల్లో రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక చిమ్మచీకట్లో ఉన్నాయి. దీంతో  ఆ గ్రామాల ప్రజలు ఓ వైపు భారీ వర్షం, మరోవైపు విద్యుత్‌ సరఫరా లేక బిక్కుబిక్కుమన్నారు. విద్యుత్‌ శాఖ ఏఈ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. మండలంలోని ఇడిమేపల్లి చెరువు కట్ట అంచులు కొటుకునిపోవడంతో గండిపడకుండా రైతులు అప్రమత్తమై పట్టలు, ఇసుక బస్తాలను ముందస్తుగా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. తహసీల్దార్‌ ఐఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ఏ సరళ, గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖాధికారిణి మంజుల, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ కరీముల్లా, వివిధ శాఖల అధికారులు లోతట్టు గ్రామాలను పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో గురువారం రాత్రి నుంచే మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్‌ వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరద ప్రవహం కొంత తగ్గడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గొలగమూడి శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఆహర పొట్లాలను అందజేశారు. అలాగే మండల వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్లను ఎమ్మెల్యే కాకాణి పంపిణీ చేయగా, జనసేన ఆధ్వర్యంలో నియోజక వర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్‌బాబు, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ కన్వీనర్‌ పొలంరెడ్డి ఇందిరారెడ్డి, నాయకురాలు అళ్లహరి దీపిక ఆహర పొట్లాలు, తాగునీటిని పంపిణీ చేశారు. 

అంతా జలమయం

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 27 : మండలంలో తుఫానుతో పొలాలు, వాగులు, వంకలు రోడ్లు పొంగిపొర్లుతుండడంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, వరి నాట్లు, నారుమళ్లు నీటమునిగాయి. గురువారం రాత్రి నుంచి నేటికీ కొన్ని గ్రామాలు చిమ్మచీకట్లోనే ఉన్నాయి. మండలంలోని దామరమడుగులో గుంతకట్ట ప్రాంతం జలమయమైంది. ఆ ప్రాంతం, చుట్టు పక్కల పొలాలు, కాలువల్లో నీళ్లు పెన్నానదిలో పోవాల్సి ఉండగా పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరద నీరు గుంతకట్ట ప్రాంతం వైపు పారాయి. దీంతో గుంతకట్ట ప్రాంతంలోని సుమారు 50 ఇళ్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. స్థానిక జనసేన యువత పలువురిని కాపాడి గట్టుకు చేర్చారు. అంతేకాకుండా మినగల్లు నుంచి దామరమడుగు పల్లెపాళెం నది వెంబడి ఉన్న పొలాల్లోని పంటలు నీటమునిగాయి. 

 కనిగిరి రిజర్వాయర్‌ నుంచి మల్లిదేవి కాలువకు నీటి విడుదల

శుక్రవారం సాయంత్రం కనిగిరి రిజర్వాయర్‌లో నీటి సామర్థ్యం పెరగటంతో ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా 300 క్యూసెక్కులను మల్లిదేవి కాలువకు మిట్ట కలుజుల ద్వారా విడుదల చేశారు. పరిస్థితి బట్టి ఇంకా నీరు విడుదల చేస్తామని నగర కమిషనర్‌ శ్రీనివాస రావు, ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. అయితే మల్లిదేవి కాలువ వెంబడి గ్రామాల ప్రజలు వరద ఉధృతి ఎంత మేర ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 

 రిజర్వాయర్‌ పరిశీలన

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి శుక్రవారం మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారి కోటేశ్వరరావుతో రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీటి ఉధృతి ప్రమాదాల గురించి ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం బుచ్చి పెద్ద ఊరు వద్ద మల్లిదేవి కాలువను పరిశీలించారు. అక్కడి నుంచి జొన్నవాడ గిరిజన కాలనీకి వెళ్లారు. నది తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న  కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.  అనంతరం పలువురు గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార పొట్లాలను అందజేశారు. ఆయన వెంట అధికారులు, నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, యర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, బుచ్చి, జొన్నవాడ నాయకులు ఉన్నారు.

 ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది

జొన్నవాడ వద్ద వరద ప్రవాహంతో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మండలంలోని మినగల్లు నుంచి జొన్నవాడ, శ్రీరంగరాజుపురం, దామరమడుగు, పల్లెపాళెం వరకు ప్రవహిస్తోంది. జొన్నవాడ ఆలయ సమీపంలోని సాన్నకట్టల వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. ఎమ్మెల్యే వస్తున్నారని అప్రమత్తమై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 

.................................................................................. 

 జల దిగ్భందంలో తీరగ్రామాలు

 మనుబోలు, నవంబరు 27: నివర్‌ తుఫాను ప్రభావంతో కాలువలు, వాగులు మరింతగా పొంగి పారుతున్నాయి. దీంతో  మండలంలోని సంగమేశ్వరాలయం నీట మునిగింది. పంటపొలాలన్నీ చెరువులను తలపించాయి. తీరప్రాంత గ్రామాలకు వెళ్లే రహదారిపై, వెంకన్నపాళెం వద్ద నీరు చేరడంతో ఐదు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కండలేరు విషయానికొస్తే ఉధృతి మరింత పెరిగింది. చెరువులు కూడా నిండడంతో కట్టలు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.  గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చెట్లు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

  విడవలూరు, నవంబరు 27: నివర్‌ తుఫాను జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు కూడా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. మలిదేవి డైయిన్‌పై వంతెన పూర్తిగా మునిగిపోవడంతో విడవలూరు నుంచి జాన్‌పేట, మన్నదరావు పేటలకు రాకపోకలు నిలిచిపోయాయి. పార్లపల్లిలో వంతెన దెబ్బతింది. అలాగే లక్ష్మీపురం పాతూరులో వర్షానికి కంజి ప్రసాద్‌కు చెందిన పూరిల్లు నెలమట్టమైంది. అంతేకాకుండా గాదెలదిన్నె, ఊటుకూరు, చౌకిచర్ల దండిగుంట గ్రామాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. సోమశిల జలాశయం నుంచి వరదనీరు సముద్రంలోకి విడుదల చేయడంతో ముదివర్తి గ్రామ ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దారు చంద్రశేఖర్‌, ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌ ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులను పనరావాస కేంద్రాలకు తరలించారు. 

ఇందుకూరుపేట, నవంబరు 27 : సోమశిల జలాశయం నుంచి నీరు వదలడంతో  ఇందుకూరుపేట వద్ద పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో కోడూరుపాడు వద ్ద పెన్నానది కట్టలు తెంచుకోవటంతో పల్లెపాడు గ్రామం జలమయమవడంతో పాటు గాంధీ ఆశ్రమం మునిగిపోయింది. కోడూరుపాడు, పల్లెపాడు మధ్య రహదారి కోతకు గురైంది. రాత్రికి మరింతగా పెన్నానది ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పల్లెపాడు గ్రామం, గాంధీఆశ్రమం, పెన్నా పొర్లుకట్టలను పరిశీలించి గండ్లు పూడ్చాలని ఆదేశాలు జారీ చేశారు. దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.  రాత్రికి అవసరమైతే పెన్నా తీర వాసులను తరలించేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఇన్‌చార్జి తహసీల్దారు నాగరాజు, ఎస్‌ఐ నరేష్‌, గొల్లపల్లి విజయకుమార్‌ తదితరులు పనులను పర్యవేక్షించారు. 

 వలస కూలీలను ఒడ్డుకు చేర్చేందుకు ఎమ్మెల్యే చొరవ

పొదలకూరు(రూరల్‌) : మండలంలోని తాటపర్తి పొలాల్లో వరదలో చిక్కుకున్న వలస కూలీలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి చొరవతో అధికారులు శుక్రవారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు తాటిపర్తి పొలాల్లో వరినాట్లు వేయడానికి రెండ్రోజుల క్రితం వచ్చారు. పొలాల్లో ఉన్న పూరింట్లో ఉంటూ నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. తుఫాన్‌తో తాటిపర్తి పెద్దవాగుకు బుధవారం రాత్రి గండిపడింది. దీంతో వరద నీరంతా పొలాలను చుట్టుముట్టడంతో కూలీలంతా పాకలోనే ఉండిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే కండలేరు డ్యాం నుంచి బోటును తెప్పించి అధికారుల సాయంతో బాధితులందరినీ ఒడ్డుకు చేర్చారు. 

నీట మునిగిన ప్రాంతాల పరిశీలన

పొదలకూరు(రూరల్‌) : మండలంలో తుఫాను ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి శోభన్‌బాబు, తహసీల్దారు స్వాతి, ఎంపీడీవో నారాయణరెడ్డి, సీఐ  గంగాధర్‌రావు మండలంలోని విరువూరు, మహమ్మదాపురం, తాటిపర్తి పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను, నివాస ప్రాంతాలను పరిశీలించారు.  తుఫానుతో సుమారు వెయ్యి ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి. నావూరు రోడ్డుపై వాగు పొంగిప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. అంతేకాకుండా బిరుదవోలు పంచాయతీ పరిధిలోని పొట్టేళ్ల చెరువు నిండి నీరు రోడ్డుపైకి రావడంతో గొల్లపాళెం, కలిచేడు రోడ్డు ధ్వంసమైంది. భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరాను అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. 

హైవేపై రాకపోకలు బ్రేక్‌

మనుబోలు: నివర్‌ తుఫాన్‌ తీరందాటినా ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చెన్నై-కలకత్తా జాతీయరహదారిపై గూడూరు సమీపంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నూతన వంతెనల నిర్మాణంలో భాగంగా పాతవాటిని ధ్వంసం చేశారు. ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేసి వాహనాలు రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేశారు. వంతెనలు ఉన్న చోట ప్రత్యామ్నాయ రోడ్డుకు తూములు ఏర్పాటు చేసి ఉంటే వచ్చే వరదప్రవాహం వాటిగుండా వెళ్లి పోయేది. అలా చేయక పోవడంతో పంబలేరుకు వచ్చిన వరదనీరు జాతీయరహదారిపైకి మళ్లింది. దీంతో రాకపోకలకు బ్రేక్‌ పడింది. ప్రవాహం వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా గూడూరు, మనుబోలు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రెండ్రోజులుగా హైవేపై వేలమంది ప్రయాణికులు గమ్యస్థానాలక వెళ్లేందుకు వీలులేక అవస్థలు పడ్డారు. 















Updated Date - 2020-11-28T05:37:05+05:30 IST