ఉచిత రేషన్‌ బియ్యానికి మంగళం

ABN , First Publish Date - 2022-05-03T05:10:22+05:30 IST

రేషన్‌షాపుల్లో నిరుపేదలకు నెలనెలా అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళం పాడాయి

ఉచిత రేషన్‌ బియ్యానికి మంగళం

================================================


కిలోకు రూ.1 చెల్లించాల్సిందే 

కరోనా ముందు నాటి విధానం అమలు 


మెదక్‌, మే 2: రేషన్‌షాపుల్లో నిరుపేదలకు నెలనెలా అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళం పాడాయి. రెండేళ్లుగా రేషన్‌ కార్డు హోల్డర్లకు ఉచితంగా రేషన్‌బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ నెల నుంచి కిలో బియ్యానికి రూ.1 చొప్పున చెల్లించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పేరిట ఉచిత రేషన్‌ పంపిణీని కొనసాగించారు. ప్రతి వ్యక్తికీ 5 కిలోల బియ్యాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున  ఇచ్చాయి. కొవిడ్‌కి ముందు ఒక్కో లబ్ధిదారుడికి కిలో రూ.1 చొప్పున 6 కిలోలు ఇచ్చేవారు. 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ప్రారంభం కావడంతో అప్పటి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నూతనంగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఈనెల నుంచి కిలో బియ్యానికి రూ.1 చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అన్నపూర్ణ కార్డుపై 10 కిలోలు, అంత్యోదయా కార్డుకు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. అంత్యోదయకార్డు దారులకు కిలో చక్కర రూ. 13 రూపాయలు కేటాయించారు. రేషన్‌డీలర్లు ప్రభుత్వానికి డీడీలు కట్టిన అనంతరం బియ్యం కేటాయింపులు జారీ చేయనున్నారు.  

Read more