నర్సింగ్‌ స్కూల్‌కు మంగళం?

ABN , First Publish Date - 2021-07-22T05:36:48+05:30 IST

ప్రజలు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతుంటే ఉన్న నర్సింగ్‌ పాఠశాల కూడా మూతపడే పరిస్థితి వచ్చింది.

నర్సింగ్‌ స్కూల్‌కు మంగళం?
నర్సింగ్‌ స్కూల్‌ భవనం

- నలుగురు ట్యూటర్ల డిప్యూటేషన్లు రద్దు 

- పోస్టులన్నీ ఖాళీ.. పొరుగు కళాశాలలో కలిపేస్తారని ప్రచారం 

- ఆందోళనలో విద్యార్థులు 

(ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రజలు జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతుంటే ఉన్న నర్సింగ్‌ పాఠశాల కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి జిల్లా ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కొత్తగా ఏర్పడిన జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలు మంజూరవుతుంటే కరీంనగర్‌లో ఉన్న నర్సింగ్‌ స్కూల్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ కాకుండా పోతున్నది. ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ట్యూటర్లందరినీ బదిలీచేయడంతో నర్సింగ్‌ స్కూల్‌ మూతపడే పరిస్థితి ఉత్పన్నమైందని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.


2013లో మంజూరు


జిల్లాలో 2013లో నర్సింగ్‌ స్కూల్‌ను మంజూరు చేశారు. 40 మంది విద్యార్థులకు మరో ఇద్దరు సర్వీసులో ఉన్న అభ్యర్థులకు ఇక్కడ మూడేళ్ల జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (జిఎన్‌ఎం) శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఐదు బ్యాచ్‌ల్లో 210 మంది శిక్షణ పొందారు. ఆరో బ్యాచ్‌ విద్యార్థులు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు 10 మంది విద్యార్థులకు ఒక ట్యూటర్‌ ఉండాలి. ప్రస్తుతం మూడు సంవత్సరాల కోర్సులో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా 12 మంది ట్యూటరు, ఒక ప్రిన్సిపాల్‌ ఉండాలి. ఇక్కడ నలుగురు ట్యూటర్లు మాత్రమే డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న నర్సింగ్‌ సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేయడంతో వారు స్వస్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ట్యూటర్‌ కూడా లేక జిల్లాలోని నర్సింగ్‌ స్కూల్‌ మూతపడే పరిస్థితి నెలకొంది. 


జిల్లా ఆసుపత్రిలో సేవలందిస్తున్న విద్యార్థులు


ప్రస్తుతం ఇక్కడ విద్యనభ్యసిస్తున్న 120 మంది విద్యార్థులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్‌ నర్సులతోపాటు సేవలందిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 500 పడలు ఉండగా ఐదుగురు రోగులకు ఒక్కరు చొప్పున షిఫ్ట్‌కు వంద మంది చొప్పున మూడు వందల మంది నర్సింగ్‌ సిబ్బంది పనిచేయాల్సి ఉన్నది. జిల్లా ఆసుపత్రిలో హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు, ఇతర నర్సులతో కలిసి మొత్తం 129 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో వారు రెట్టింపు పనిచేయాల్సి వస్తున్నది. వారికి తోడుగా ఈ 120 మంది నర్సింగ్‌ విద్యార్థులుండడంతో రోగులకు వైద్యసేవలందుతున్నాయి.


పొరుగు జిల్లాల్లోని కళాశాలల్లో కలుపుతారని ప్రచారం


నర్సింగ్‌ స్కూల్‌కు రెగ్యులర్‌ సిబ్బందిని నియమిచకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగున ఉన్న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నర్సింగ్‌ కళాశాల్లో కలిపే అవకాశమున్నదని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు  ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న నర్సింగ్‌ పాఠశాలను నర్సింగ్‌ కళాశాలగా మార్చాలని, ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నర్సింగ్‌ కళాశాల వస్తే బ్యాచ్‌కు వంద మంది చొప్పున శిక్షణ పొందే అవకాశం కలుగుతుంది. ఆ రూపంలో 300 మంది విద్యార్థుల సేవలు ఇక్కడ ఆసుపత్రిలో రోగులకు అందే అవకాశముంటుంది. కళాశాల మంజూరు ఏమోగానీ ఉన్న నర్సిగ్‌ స్కూల్‌ పోతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2021-07-22T05:36:48+05:30 IST