104 సేవలకు మంగళం?

ABN , First Publish Date - 2021-03-07T07:46:02+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహన సేవలను నిలిచిపోనున్నాయా? వాటిని పూర్తిగా రద్దు చేయాలని సర్కారు భావిస్తోందా..

104 సేవలకు మంగళం?

  • యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • నిలిపివేతపై ఈ వారంలో నిర్ణయం 
  • 2007 నుంచి నిర్విరామంగా సేవలు
  • మొత్తం వాహనాలు 195 
  • ప్రస్తుతం కండిషన్‌లో ఉన్నవి 120 

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహన సేవలను నిలిచిపోనున్నాయా? వాటిని పూర్తిగా రద్దు చేయాలని సర్కారు భావిస్తోందా? అందుకే ఉన్న వాహనాలకు మరమత్తులు చేయించడం లేదా? కొత్తవి కొనుగోలు చేయనిది కూడా అందుకేనా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్తూ బీపీ, షుగర్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులందించే 104 వాహన సేవలకు గండం ఏర్పడింది. వాటిని పూర్తిగా నిలిపివేయాలనే యోచనలో సర్కారు ఉంది. అందుకు  సంబంధించి అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం తెప్చించుకుంటోంది. శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 104 సేవలపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 104 బాధ్యులు, డీప్యూటీ డీఎంహెచ్‌వోలతో సమావేశమయ్యారు. సేవలను కొనసాగించాలా వద్దా? ప్రస్తుతం వాటి పనితీరు ఎలా ఉంది? అన్న  అంశంపై వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే మార్చి 8న మరికొన్ని జిల్లాలకు సంబఽంధించిన వారితో కూడా సమావేశమై ఒకటి రెండు రోజుల్లో వీటి సేవలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2007లో 104 వాహపాల సేవలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో వీటి సేవలు కొనసాగాయి. 2010లో ఆ సంస్థ నుంచి ప్రభుత్వ పరిధిలోకి ఈ సిబ్బంది అంతా వచ్చారు. రాష్ట్రంలో మొత్తం 195 వాహనాలుండగా, ప్రస్తుతం 120 వాహనాలే సేవలందిస్తున్నాయి. మిగతావన్నీ కూడా మూలనపడ్డాయి. వీటిలో విధులు నిర్వర్తిస్తున్న 1375మంది.. ప్రస్తుతం ఆయా డీఎంహెచ్‌వోల పరిధిలో పని జేస్తున్నారు. 


కొత్తవి కొనరు.. పాతవి రిపేరు చేయరు

రాష్ట్రంలో 80 వరకు వాహనాలు రిపేరుకు వచ్చాయి. ఎప్పుడో 2007లో కొనుగోలు చేసినవి కావడంతో ఇప్పటికే లక్ష కిలోమీటర్లు తిరిగాయి. వాటి సర్వీసు దాదాపు ముగిసింది. అయితే పాడైన వాటికి వైద్య ఆరోగ్యశాఖ మరమ్మతులు  చేయించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45లక్షలను మరమ్మత్తుల కోసం కేటాయించగా, ఒక్క పైసా విడుదల చేయలేదు. పైగా ఆ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిపేర్లు చేయించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కొత్తవి ఒక్కటీ కూడా కొనడం లేదు. సేవలను నిలిపివేయాలన్న యోచనతో సర్కారు ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరిస్తోందని 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు. 


నిలిపివేతకు కారణమిదా? 

జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి ఎన్‌సీడీ(నాన్‌ కమ్యూనకబుల్‌ డిసీజ్‌) స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. అలాగే మందులు కూడా ఇస్తున్నారు. ఇక 104 వైద్య సిబ్బంది కూడా ఇదే చేస్తున్నారు. దీంతో ఒక రకమైన సేవలకు ఇరువురు చేయడమేందుకనే యోచనతో వీటిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.


సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి 

104 సేవలను ఉపసంహరించే యోచనలో సర్కారు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వాటికి మరమ్మతులు కూడా చేయించడం లేదు. వాటి సేవలను నిలిపివేస్తే అందులో పనిజేసే వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. 14 ఏళ్లుగా పని జేస్తున్నారు. ఇతర ఉద్యోగావకాశాలకు వారి వయో అర్హత కూడా దాటిపోయింది. 104 సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. 

- విజయ్‌వర్ధన్‌, 104 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2021-03-07T07:46:02+05:30 IST