శతాబ్దం కిందటి ఈ వ్యాక్సిన్ కరోనాతో పోరాడవచ్చు: శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-04-01T01:20:54+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు కరోనాను తగ్గించే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక బయోటెక్ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు

శతాబ్దం కిందటి ఈ వ్యాక్సిన్ కరోనాతో పోరాడవచ్చు: శాస్త్రవేత్తలు

ఆమ్‌స్టర్‌డామ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు కరోనాను తగ్గించే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక బయోటెక్ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే పూర్తిస్థాయి వ్యాక్సిన్ రావడానికి మాత్రం సంవత్సరం సమయం పడుతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాలోని కొంత మంది శాస్త్రవేత్తలు ఇటీవల మలేరియా, హెచ్‌ఐవీకి వాడే డ్రగ్స్‌ కరోనాను కూడా నయం చేస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు శతాబ్దం కిందటి మరో వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందంటూ నెదర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీబీకి వాడే బీసీజీ అనే వ్యాక్యిన్ రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనాతో పోరాడగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే చూపిస్తోంది. ఇదే సమయంలో ఈ బీసీజీ వ్యాక్సిన్ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా రేయింబవళ్లు కరోనా సోకిన పేషంట్ల కోసం శ్రమిస్తున్న డాక్టర్లకు ఇది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. కాగా.. నెదర్లాండ్స్‌లోని యూఎమ్‌సీ హాస్పిటల్ టీమ్ ఈ వారంలో దీనిపై ప్రయోగం నిర్వహించేందుకు సిద్దమైంది. మొత్తం ఎనిమిది ఆసుపత్రుల నుంచి వెయ్యి మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఈ ప్రయోగంలో పాలుపంచుకోనున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్ టీమ్ కూడా బీసీజీ స్టడీని మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్టడీలో ఆస్ట్రేలియా వ్యాప్తంగా 4 వేల మంది హెల్త్‌వర్కర్లు పాల్గొననున్నారు. మరి ఈ ప్రయోగాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. 

Updated Date - 2020-04-01T01:20:54+05:30 IST