అర్హులకు మొండిచేయి

ABN , First Publish Date - 2021-06-25T05:52:11+05:30 IST

వైసీపీ నాయకులు సూచిస్తే అర్హతతో పనే ఉండదు. వారు వద్దని చెబితే అన్ని అర్హతలూ ఉన్నా పథకం వర్తించదు. దీనికి అనేక కారణాలు సృష్టించి అనర్హుల జాబితాలోకి పేర్లు నెట్టేస్తారు.

అర్హులకు మొండిచేయి
మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న మహిళలు (ఫైల్‌)

చేయూత పథకం అమలులో వివక్ష 

అర్హతలు ఉన్నా జాబితాలో లేని పేర్లు

వివిధ కారణాలు చూపి రిజక్ట్‌ చేసిన వలంటీర్లు 

గ్రామాల్లో బాధిత మహిళల గగ్గోలు


రోలుగుంట, జూన్‌ 24: వైసీపీ నాయకులు సూచిస్తే అర్హతతో పనే ఉండదు. వారు వద్దని చెబితే అన్ని అర్హతలూ ఉన్నా పథకం వర్తించదు. దీనికి అనేక కారణాలు సృష్టించి అనర్హుల జాబితాలోకి పేర్లు నెట్టేస్తారు. ఇదీ మండలంలోని వలంటీర్ల తీరు! చేయూత పథకానికి అర్హతలు ఉన్నా డబ్బులు పడని బాధిత మహిళలు ఇలా ఎందుకు జరిగిందని గగ్గోలు పెట్టగా, వలంటీర్లు తమ లాగిన్‌లో రిజక్ట్‌ చేశారని తేలడమే ఇందుకు తార్కాణం!


మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున మొత్తం 255 మంది గ్రామ వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన వలంటీర్లు, స్థానికంగా వైసీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు సూచించిన వ్యక్తులకు ఇవ్వడం.. ఆపాలని చెబితే అర్హత ఉన్నప్పటికీ అనర్హుల జాబితాలో పెట్టడం చేస్తున్నారని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


మండలంలోని కొండపాలెం, రొంగలిపాలెం, జె.నాయుడుపాలెం, జగ్గంపేట, రోలుగుంట తదితర గ్రామాల్లో చేయూత పథకంలో రెండో విడత సొమ్ము జమకాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా గ్రామ వలంటీర్లు తమ లాగిన్‌లో రిజక్ట్‌ చేశారని తెలిసి నివ్వెరపోయారు. కొండపాలెంలో శతశాతం అర్హత ఉండీ, గత ఏడాది లబ్ధి పొందినా బొట్టా సత్యవతి ఎన్నో ఎళ్ల నుంచి గ్రామంలోనే ఉంటున్నా, వలస వెళ్లిపోయిందని వలంటీరు రిజక్ట్‌ చేశారు. అలాగే పాము నూకాలతల్లికి ఎకరం భూమి లేకపోయినా మూడు ఎకరాలకు పైగా ఉన్నట్టు వలంటీరు కావాలనే రిజక్ట్‌ కొట్టారు. అలాగే కిల్లాడ చింతల్లి, రాజాన అర్జునమ్మ, వైదాసు కన్నతల్లి, తంగేటి లక్ష్మి, కిల్లాడ రమణ తదితరులు విద్యుత్‌ వినియోగం 100 యూనిట్లు దాటకపోయినా, 300 యూనిట్లు పైగా వినియోగిస్తున్నట్టు వలంటీర్లు అనర్హుల జాబితాల్లో పేర్లు చేర్చారు. అలాగే రొంగలిపాలెంలో రొంగలి వరహాలు, రెడ్డి వరలక్ష్మి, రొంగలి పరదేశమ్మ, రొంగలి లక్ష్మి, రొంగలి రమణమ్మ, సబ్బవరపు రామయ్యమ్మ శతశాతం అర్హులైనా వలంటీర్లు ఇన్‌కం ట్యాక్స్‌ పేయర్స్‌, అధిక భూమి, విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లుపైగా వినియోగమనే కారణాలతో వలంటీర్లు రిజక్ట్‌ చేసేశారు. జె.నాయుడుపాలెం, జగ్గంపేట, రోలుగుంట తదితర గ్రామాల్లో కూడా చేయూత పథకం వర్తింపచేయడంలో వలంటీర్లు వివక్ష చూపారని బాధిత మహిళలు గగ్గోలు  పెడుతున్నారు.


వలంటీరు లాగిన్‌లో నమోదు చేసుకోవాలి

-కె.ప్రభాకర్‌రావు, ఎంపీడీవో, రోలుగుంట

పథకాల అమలు బాధ్యత గ్రామ వలంటీర్లదే. వారి లాగిన్‌లో లబ్ధిదారులు నమోదు చేసుకుంటే సచివాలయంలో వెరిఫికేషన్‌ అనంతరం ఎంపిక చేస్తారు. అన్ని అర్హతలు ఉండీ చేయూత పథకంలో సొమ్ము పడకపోతే మరోమారు వివరాలు సరిచేసుకుని దరఖాస్తు చేసుకుంటే వస్తుంది. 



Updated Date - 2021-06-25T05:52:11+05:30 IST