TTV Dhinakaran: హామీలేమయ్యాయి?

ABN , First Publish Date - 2022-08-16T13:01:30+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అధికార డీఎంకేను నిలదీసింది. ఆ హామీలు అమలు

TTV Dhinakaran: హామీలేమయ్యాయి?

- అవి అమలయ్యేదాకా ఆందోళనలే 

- రాష్ట్ర ప్రభుత్వానికి ఏఎంఎంకే హెచ్చరిక


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 15: శాసనసభ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అధికార డీఎంకేను నిలదీసింది. ఆ హామీలు అమలు చేసేంత వరకు ఆందోళనలు చేపడతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో సోమవారం ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) అధ్యక్షతన పార్టీ సాధారణ సర్వసభ్యమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. ముందుగా దినకరన్‌ ఈ సభలో పార్టీ నిర్వాహకులు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వం పెంపు తదితర అంశాలపై ప్రసంగించారు. అనంతరం సమావేశంలో 14 తీర్మానాలను ఆమోదించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడుపుతున్న దినకరన్‌ నాయకత్వాన్ని బలపరచడం, పట్టణ, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపై తీర్మానం ఆమోదించారు. పశువులు, గొర్రెల పంపిణీ పథకం, ప్రజల వాహన పథకం, గృహిణులకు అందజేయాల్సిన బహుమతులు, విద్యార్థులకు ల్యాప్‌టా్‌పల పథకం, అమ్మ తాగునీరు, అమ్మాసిమెంట్‌, అమ్మా మినీ క్లినిక్‌లను మూసివేసిన డీఎంకే(DMK) ప్రభుత్వానికి ఈ సమావేశం తీవ్రంగా ఖండన తెలిపింది. అదే విధంగా కావేరీ నది(Kaveri river)పై మెకెదాటు వద్ద డ్యాం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం డీఎంకే ప్రభుత్వానికి లేదని పేర్కొన్న సమావేశం.. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాల్సివుందని అభిప్రాయపడింది. పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. టోల్‌గేట్ల సంఖ్యను తగ్గించాలని కోరింది. రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుద చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.  150 శాతం వరకు ఆస్తి పన్ను పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ద్రావిడపాలన అని చెప్పుకుంటున్న డీఎంకే ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఏఎంఎంకే తరఫున ఆందోళన చేపట్టాలని సమావేశం తీర్మానించింది. అదే విధంగా పార్టీ అధ్యక్ష పదవిని సృష్టించడంతో పాటు, ఆ పదవికి ఎన్నిక నిర్వహించాలని చివరి తీర్మానం ఆమోదించింది.

Updated Date - 2022-08-16T13:01:30+05:30 IST