కల్కిగా కోనేటిరాయుడి వైభవం

ABN , First Publish Date - 2020-09-27T15:31:34+05:30 IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కల్కి అలంకారంలో..

కల్కిగా కోనేటిరాయుడి వైభవం

ఉదయం సర్వభూపాలవాహనంపై దర్శనం 

నేటితో పూర్తి కానున్న బ్రహ్మోత్సవాలు 


తిరుమల(ఆంధ్రజ్యోతి): శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి  కల్కి అలంకారంలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. రంగనాయక మండపంలో ఉత్సవమూర్తికి కల్కి అలంకారం చేసి తిరుచ్చిపై ఊరేగింపుగా కల్యాణోత్సవ మండపానికి తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అశ్వవాహనంపై కొలువుదీర్చి వాహనసేవ వైదిక కార్యక్రమాలైన దివ్యప్రబంధం, వేదపారాయణం, శాత్తుమొర, నైవేద్యం, హారతులు సమర్పించారు. కాగా, ఉదయం 7 గంటలకు మహారథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనసేవను నిర్వహించారు. కరోనా ప్రభావంతో వాహన సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహించాల్సివచ్చిన క్రమంలో మహారథాన్ని రద్దు చేసి ఆస్థానంలో సర్వభూపాలవాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువుదీర్చారు.


సర్వభూపాల వాహనాన్ని కూడా చిన్నరథం తరహాలో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానాన్ని ఆలయంలోనే నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి చక్రత్తాళ్వారును ఆలయంలో తాత్కాలికంగా నిర్మించిన నీటి తొట్టెలో ముంచనున్నారు. అలాగే సాయంత్రం ధ్వజావరోహణాన్ని నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అధిక మాసం సందర్భంగా తిరిగి అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. 


Updated Date - 2020-09-27T15:31:34+05:30 IST